
ఎన్నికలు జరిగేది 7 స్థానాలకు, కానీ పోటీలో ఉన్నది మాత్రం 8మంది. అధికార వైసీపీ నుంచి ఏడుగురు, ప్రతిపక్ష టీడీపీ నుంచి ఒక్కరు బరిలోకి దిగారు. అధికారపక్షానికున్న బలం ప్రకారమైతే ఏడింటికి ఏడూ ఏకగ్రీవం కావాలి. ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఇచ్చింది టీడీపీ. అనూహ్యంగా అభ్యర్ధిని బరిలోకి దింపింది. దాంతో, అధికారపక్షంలో అలజడి మొదలైంది. అసలే ఎలక్షన్ ఇయర్, చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం, కొందరైతే ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్‌లో ఉన్నారనే గుసగుసలు. ఆల్రెడీ ఒకరిద్దరు బహిరంగంగానే తిరుగుబాటు జెండా ఎగరేసి ఉండటంతో ఇవాళ జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారిపోయాయ్. మరి, ఇవాళ ఏం జరగబోతోంది?.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించనివిధంగా టీడీపీ ఘనవిజయం సాధించడంతో ఆంధ్రా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయ్. మొత్తం మూడు సీట్లనూ తెలుగుదేశం గెలుచుకోవడంతో అధికారపక్షం అలర్టైంది. ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయకుండా సకల జాగ్రత్తలు తీసుకుంది వైసీపీ. రెండుమూడుసార్లు మాక్ పోలింగ్ నిర్వహించి ఓటు ఎలా వేయాలో ట్రైనింగ్ ఇచ్చింది. అదే టైమ్‌లో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను గుర్తించి వాళ్లతో మాట్లాడింది అధిష్టానం. సీఎం జగనే స్వయంగా కొందరు ఎమ్మెల్యేలకు ఫోన్‌చేసి మాట్లాడినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇంతచేసినా కూడా ఏదోమూల ఆందోళన, భయం అధికారపక్షాన్ని వెంటాడుతోంది.
అసెంబ్లీలో బలాబలాలను చూస్తే వైసీపీ 151మంది సభ్యులు ఉన్నారు. అయితే టీడీపీ నుంచి గెల్చిన నలుగురు ఎమ్మె్ల్యేలు, జనసేన ఏకైక ఎమ్మెల్యే కూడా సపోర్ట్ ఇస్తుండటంతో వైసీపీ బలం 156కి చేరింది. కానీ ఇటీవలే తిరుగుబాటు జెండా ఎగరేసిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి విషయంలో కాస్త టెన్షన్ నెలకొంది. సో .. వైసీపీ తన బలాన్ని 154గానే లెక్కిస్తోంది. వీళ్లను 7 టీమ్‌లుగా విభజించి.. ఒక్కో టీమ్‌కు ఒక్కో లీడర్‌ను పెట్టారు. ప్రస్తుతం ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే కచ్చితంగా 22 ఓట్లు కావాలి. అంటే ఈ 154 మందిలో ఒక్క ఓటు కూడా నష్టపోకూడదు.
ఇక టీడీపీ విషయానికి వస్తే.. వైసీపీకి మద్దతిస్తోన్న నలుగురిని తీసేస్తే ఆ పార్టీ బలం 19. ఈ బలంతో MLC గెలిచే ఛాన్స్ లేదు. కానీ ఓటింగ్ రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. వైసీపీ రెబల్ ఓట్లపై ఆశలు పెట్టుకుంది టీడీపీ. అందుకే చివరి నిమిషంలో తమ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధను బరిలో నిలిపింది. ఇక, వైసీపీ నుంచి పెన్మత్స సూర్యనారాయణరాజు, కోలా గురువులు, ఇజ్రాయిల్, మర్రి రాజశేఖర్, జయమంగళం వెంకటరమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నం బరిలో ఉన్నారు. అంటే, ఒకవైపు ఏడుగురు పోటీపడుతుంటే, ఆ ఏడుగురికీ అపోజిట్‌గా నిలబడింది పంచుమర్తి అనురాధ. ఒకవేళ టీడీపీ గెలిచిందంటే ఈ ఏడుగురిలో ఒక్కరు ఔట్ ఖాయం. మరి, ఇవాళ ఏం జరగబోతోంది?. ఏపీ పాలిటిక్స్‌లో ఊహించని సంచలనాలు ఉంటాయా? లేక అంతా సాఫీగా ముగిసిపోతుందా?