84 సీసీటీవీలు తేల్చలేని కేసు.. ఒక్క సర్జికల్ స్క్రూతో హంతకుడిని పట్టుకున్న పోలీసులు

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో వెలుగుచూసిన గుర్తుతెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఎలాంటి గుర్తింపు కార్డులు గానీ, ప్రాథమిక ఆధారాలు గానీ లేని ఈ కేసులో.. మృతురాలి ఎడమ కాలికి అమర్చిన సర్జికల్ ఇంప్లాంట్ స్టీల్ ప్లేట్, స్క్రూ సీరియల్ నంబర్ ప్రధాన ఆధారంగా మారి నిందితుడిని పట్టించింది. ఇంతకూ పోలీసులు నిందితుడిని ఎలా పట్టుకున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

84 సీసీటీవీలు తేల్చలేని కేసు.. ఒక్క సర్జికల్ స్క్రూతో హంతకుడిని పట్టుకున్న పోలీసులు
Akividu Murder Case

Edited By:

Updated on: Aug 24, 2026 | 10:23 PM

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో సంచలణం సృష్టించి మహిళ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళను భర్తే హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 15న ఆకివీడు సమీపంలోని ఉప్పుటేరు వద్ద దుప్పట్లో చుట్టి, పొదల్లో పడేసిన స్థితిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమె గొంతు నులిమి హత్య చేసిన ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఆరు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఏలూరు రేంజ్ పరిధిలోని కాకినాడ, రాజమండ్రి, భీమవరం, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని మహిళల మిస్సింగ్ కేసులను పరిశీలించారు. ఘటనా స్థలం పరిసరాల్లోని సుమారు 84 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను తనిఖీ చేశారు. గ్రామాల్లోని ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీలు, సోషల్ మీడియా ద్వారా సమాచారం సేకరించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.

కేసును మలుపు తిప్పిన మెడికల్ ఇంప్లాంట్

మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టంలో ఆమె ఎడమ కాలికి సర్జికల్ స్టీల్ ప్లేట్, స్క్రూ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ స్క్రూలను ముంబైకి చెందిన ఒక మెడికల్ పరికరాల తయారీ కంపెనీ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. కంపెనీ అందించిన యూనిక్ సీరియల్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేయగా, గతంలో రోడ్డు ప్రమాదంలో గాయపడినప్పుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ ఇంప్లాంట్‌ను సర్జరీ ద్వారా అమర్చినట్లు వెల్లడైంది. ఆసుపత్రి రికార్డులను పరిశీలించి మృతురాలిని ఉప్పాడ దేవిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

హత్యకు కారణం.. నిందితుడి అరెస్ట్

కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగానే భర్త నారాయణరావు ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. భీమవరంలోని సాయి వంశీకృష్ణ అపార్ట్‌మెంట్‌లో భార్య దేవిని గొంతు నులిమి చంపిన అనంతరం, మృతదేహాన్ని కారులో తీసుకొచ్చి ఆకివీడు ఉప్పుటేరు సమీపంలో పడేశాడు. నిందితుడు నారాయణరావును అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us