చదువులో చరుకుగా ఉండే ఆ చిన్నారి పదేళ్లకే ప్రాణాలు విడిచింది. సీఎం జగన్ పర్యటనలో ఆయన దృష్టిని ఆకర్షించిన బాలిక విగత జీవిగా మారింది. డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాలు విడిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని కుయిగూరు గ్రామంలో ఏసుబాబు తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఏసుబాబు కల్లూరు మాజీ సర్పంచ్. అతని కుమార్తె సంధ్య చింతూరులో ఐదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో ఏసుబాబు అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స కోసం భద్రాచలంలోని (Bhadrachalam) ఓ ఆస్పత్రిలో చేరాడు. ఆ సమయంలో సంధ్య కూడా ఆయనతో పాటే ఉంది. వైద్యులు ఏసుబాబుకు చికిత్స అందించడంతో ఆతను కోలుకున్నాడు. దీంతో వైద్యులు అతనిని డిశ్చార్జ్ చేశారు. అయితే సంధ్యకు అనారోగ్యంగా ఉండటంతో వెంటనే అప్రమత్తమై అదే ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సాధారణ జ్వరమేమని, భయపడాల్సిందేమీ లేదని డాక్టర్లు చెప్పడంతో ఇంటికి వెళ్లారు. బుధవారం సంధ్యకు తీవ్ర జ్వరం వచ్చింది. జ్వరంతో వణికిపోతుండటంతో చింతూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. రక్త పరీక్షల్లో డెంగీగా తేలింది. మెరుగైన వైద్యం కోసం భద్రాచలం వెళ్లాలని చింతూరు వైద్యులు సూచించారు. వారి సూచనతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. చివరికి గురువారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచింది.
కాగా.. జులైలో గోదావరికి వరదలు వచ్చి ముంపు గ్రామాలు నీట మునిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బాధితులను పరామర్శించేందుకు సీఎం జగన్ జులై 27న చింతూరు మండలం కుయిగూరులో పర్యటించారు. ఆ సమయంలో సంధ్య అక్కడే ఉంది. ఆమెను సీఎం దగ్గరకు పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాంటి చురుకైన బాలిక ఇంతలోనే మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే గోదావరికి వరదలు వచ్చిన తర్వాత మెరుగైన వైద్య సౌకర్యాలు కొరవడి, తీవ్ర అనారోగ్యానికి గురవతున్నామని స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..