Vizag: ట్రైన్ ఏసీ భోగీలో పోలీసులు తనిఖీలు.. నలుగురు వ్యక్తుల పొంతనలేని సమాధానాలు.. చెక్ చేయగా

|

Sep 03, 2022 | 8:43 AM

సాధారణంగా.. ఈ మధ్యకాలంలో అన్ని రైళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిఘా పెంచారు. ఆర్పిఎఫ్ పోలీసులు కూడా తనిఖీలు చేస్తున్నారు. డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలపై నిఘా పెంచి నిందితులను పట్టుకుంటున్నారు.

Vizag: ట్రైన్ ఏసీ భోగీలో పోలీసులు తనిఖీలు.. నలుగురు వ్యక్తుల పొంతనలేని సమాధానాలు.. చెక్ చేయగా
Falaknuma Express
Follow us on

Andhra Pradesh: ట్రైన్ నెంబర్ 12703.. హౌరా సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్ ప్రెస్(Falaknuma Express).. మరికాసేపట్లో ప్లాట్ ఫామ్ పైకి రానుంది. ఈ అనౌన్స్‌మెంట్ విశాఖ రైల్వే స్టేషన్ లో వినిపించింది. ఆ రైలు కోసం వెయిట్ చేసే ప్రయాణికులు అంతా సిద్ధమవుతున్నారు. ఇంతలో రైలు రానే వచ్చింది. పాసింజర్స్  రైలు ఎక్కుతున్నారు. ఒకేసారి బూట్ల చప్పుడు మారు మోగింది. ఖాకీ డ్రెస్సుల్లో ఉన్న RPF పోలీసులు.. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సిబ్బంది.. A1 ఏసీ కోచ్ లోకి ఎక్కారు. లోపల ఉన్న ప్రయాణికులంతా.. ఎక్కడికైనా బందోబస్తుకు వెళ్తున్నారేమో అనుకున్నారు. కట్ చేస్తే.. అంతా సీట్ నెంబర్ 11 దగ్గరకు వెళ్లి ఆగారు. ప్రశ్నలు కురిపిస్తున్నారు. చూడడానికి ప్రయాణికులు అఫీషియల్ గా ఉన్నారు. వారి దగ్గర లగేజ్ కూడా ఉంది. ఒక్కొక్కరిని ఒక్కోవైపుగా ప్రశ్నిస్తున్నారు. కాస్త తడబడే సరికి అనుమానం బలపడింది. లగేజ్ చెక్ చేస్తే.. చెప్పేదేముంది..?! ఏసీ భోగిలో గంజాయి వాసన గుప్పు మంది..!

– వెస్ట్ బెంగాల్ రిస్రా ప్రాంతానికి చెందిన షరాఫత్ అలీ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, తర్జీమ్ అన్వర్, మొహమ్మద్ సమీర్.. ఈ నలుగురు వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌లో విజయనగరం వరకు వచ్చేసారు. అక్కడ వికాస్ అనే వ్యక్తిని కలిశారు. ఆ నలుగురికి వికాస్ ఆశ్రయం కల్పించి.. గంజాయితో పాటు ట్రైన్ టికెట్స్ బుక్ చేసి.. కొంత నగదు ఇచ్చి సిద్ధం చేశాడు. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్లే పలకనుమ ఎక్స్‌ప్రెస్‌ కు షరాఫత్ అలీ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, తర్జీమ్ అన్వర్, మొహమ్మద్ సమీర్.. బయలుదేరారు. సాధారణ భోగిల్లో అయితే నిఘా ఎక్కువగా ఉంటుందన్న ఆలోచనతో.. దర్జాగా ఏసి టికెట్ బుక్ చేసుకుని ట్రైన్ లో కూర్చున్నారు. A1 కోచ్ లోని బెర్త్ నెంబర్ 11.. 12.. 13.. మరొకటి వెయిటింగ్ లిస్ట్. ఆయా సీట్లలో ఈ నలుగురు సర్దుకున్నారు. తమతో తెచ్చుకున్న లగేజ్ ని సర్దుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు. మిగతా ప్రయాణికులు కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు.

– రాత్రి అవడంతో కొంతమంది పడుకునేందుకు రెడీ అవుతున్నారు. విజయనగరం తర్వాత ట్రైన్ విశాఖపట్నం రీచ్ అవుతుంది. ప్లాట్ ఫామ్ పైకి వచ్చి ఆగింది. ఎస్ ఈ బీ -4 స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిహెచ్ వి ప్రసాద్ నేతృత్వంలోని ముగ్గురు అధికారులు.. మరో ఎనిమిది మంది రైల్వే పోలీసుల సహకారంతో A1 ఏసీ బోగిలోకి ఎక్కారు. రెండు బృందలుగా రెండు వైపుల నుంచి వెళ్లి.. అనుమాస్పదంగా నలుగురు యువకులు ఉన్న 11,12,13 బెర్తుల వద్ద ఆగి ప్రశ్నించారు. ఎస్ ఈ బి అధికారుల అనుమానం నిజమైంది. అక్కడే అసలు విషయం బయటపడింది. వెస్ట్ బెంగాల్ కు చెందిన ఆ నలుగురు యువకులు.. గంజాయిని తరలిస్తున్నట్టు నిర్ధారించుకున్నారు. లగేజ్ బ్యాగుల్లో దాచిన గంజాయి సీజ్ చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. వారిని ప్రశ్నించే సరికి అసలు విషయాన్ని బయటపెట్టారు. విజయనగరం నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తీసుకెళ్తున్నట్టు విచారణలో చెప్పారు వెస్ట్ బెంగాల్ కు చెందిన ఆ నలుగురు. గంజాయి తరలించే గుట్టును విప్పారు.

అందుకే ఆ భోగిలో..!

– సాధారణంగా.. ఈ మధ్యకాలంలో అన్ని రైళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిఘా పెంచారు. ఆర్పిఎఫ్ పోలీసులు కూడా తనిఖీలు చేస్తున్నారు. డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలపై నిఘా పెంచి నిందితులను పట్టుకుంటున్నారు. అయితే ఆ తనిఖీలు సాధారణ భోగిల్లోనే ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకంటే సాధారణ ప్రయాణికుల కొంతమంది.. కూలీల మరికొంతమంది.. జనరల్ స్లీపర్ బోగీలో ఎవరికి అనుమానం రాకుండా ప్రయాణిస్తూన్నారు. అయితే వాళ్లపైన అధికారులు నిఘా పెట్టి పట్టుకుంటుండడంతో.. ఇక మరో అడుగు ముందుకు వేశారు స్మగ్లర్లు. ఉన్నత వర్గాలు ప్రయాణించే ఏసి భోగిలను ఎంచుకున్నారు. ఆయా భోగిల్లో అనుమానం రాదు.. నిఘా కూడా అంత ఉండదు. దీంతో.. తమ వ్యవహారాలను ఎవరికి అనుమానం రాకుండా చేయవచ్చునది ఈ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ఆలోచన. అందుకే ఏసీ కోచ్ టికెట్ తీసుకుని మరీ.. చక్కగా లగేజ్ బ్యాగ్ లో గంజాయిని సర్దుకుని ఎక్కేసారు. కానీ పక్కా సమాచారంతో.. రంగంలోకి దిగిన ఎస్ ఈ బి అధికారులు.. ఆర్పీఎఫ్ సహకారంతో ఈ ఇంటర్ స్టేట్ గంజాయి స్మగ్లింగ్ ముఠా… బండారాన్ని బయటపెట్టారు. షరాఫత్ అలీ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, తర్జీమ్ అన్వర్, మొహమ్మద్ సమీర్..లను అరెస్టు చేసి.. వారి నుంచి 94 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో నాలుగు మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేశారు. గంజాయి స్మగ్లర్లు ఎన్ని ఎత్తులు వేసినా.. చివరకు చిక్కిపోక తప్పదని సంకేతాలు పంపారుSEB అధికారులు. ప్రధాన నిందితుడు వికాస్ కోసం గాలిస్తున్నారు.

ఖాజా, వైజాగ్

మరిన్ని ఏపీ వార్తల కోసం