Andhra Pradesh: కూలీల పైనుంచి వెళ్లిన టిప్పర్.. కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే..

తెల్లవారగానే వారి బతుకులు కూడా తెల్లారిపోయాయి. రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద కూలీలు.. రోజులాగే ఈరోజు కూడా ఉపాధి హామీ పనుల కోసం బయలుదేరారు. కానీ అంతలోనే మృత్యువు టిప్పర్ లారీ రూపంలో దూసుకొచ్చింది. కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదం గుండెల్ని పిండెస్తుంది.

Andhra Pradesh: కూలీల పైనుంచి వెళ్లిన టిప్పర్.. కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే..
Kakinada Road Accident

Updated on: May 16, 2026 | 8:30 AM

ఆంధ్రప్రదేశ్‌ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొట్టకూటి కోసం ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కూలీలను ఓ అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ బలితీసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక సమాచారం ప్రకారం.. కాకినాడ రూరల్ పరిధిలోని కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొందరు కూలీలు ఉదయాన్నే ఉపాధి హామీ పనుల్లో పాల్గొనేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో అటుగా అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఒక టిప్పర్ లారీ.. నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను బలంగా ఢీకొట్టింది.

లారీ వేగం ఎక్కువగా ఉండటంతో కూలీలు ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కన్నుమూశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన కాసేపటికే తమవారు శవాలై పడి ఉండటం చూసి మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలంలో కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us