
అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీ గిరి నాగు బావిలో చిక్కుకుంది. బయటకు రాలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సర్పమైనా ప్రాణమున్న జీవే కదా.. దానిని చూసి చలించిపోయారు గిరిజనులు. ఎలాగైనా ప్రాణాలు కాపాడాలని అనుకున్నారు. లోపలికి దిగి రక్షిద్దామంటే హాని తలపెడుతుందేమోనన్న భయం. దీంతో అటవీశాఖ అధికారుల సాయంతో పాములు రెస్క్యూ చేసే ఈస్టర్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. అయితే.. బావి నుంచి బయటకు తీసాక బంధిస్తున్న క్రమంలో అలజడి రేపింది ఆ గిరి నాగు.
అల్లూరి జిల్లా అనంతగిరి మండలం జీనబాడు పంచాయితీ పరిధిలోని గంగవరం గ్రామంలో ఓ భారీ గిరినాగును అటవీశాఖ అధికారులు, ఈజీడబ్ల్యూఎస్ (EGWS) బృందం సంయుక్తంగా రక్షించారు. బావిలో పడిపోయిన 13 అడుగుల గిరినాగును సురక్షితంగా బయటకు తీసి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అనంతగిరి మండలం జీనబాడు పంచాయితీ గంగవరం గ్రామ పొలాల్లో బావిలో ఉన్న 13 అడుగుల భారీ గిరినాగు పడిపోయినట్లు స్థానిక గిరిజనులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రేంజర్ ఆర్.రాజబాబు ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది, EGWS స్నేక్ క్యాచర్స్ ఘటనాస్థలికి చేరుకుని జాగ్రత్తగా నాగును బయటకు తీశారు. పామును ప్రాణాపాయం నుంచి సురక్షితంగా రక్షించడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు.
మరో వైపు బావి నుంచి బయటకు తీసిన తర్వాత ఆ పామును బంధించే ప్రయత్నం చేశారు. దీంతో అది కాస్త అలజడి రేపింది. ఈ క్రమంలో అత్యంత చాకచక్యంగా 13 అడుగుల భారీ గిరినాగును బంధించారు. అనంతరం ప్రాణాపాయం నుంచి రక్షించిన గిరినాగును శంకరం అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. వన్యప్రాణులను హాని చేయకుండా వెంటనే అటవీశాఖకు సమాచారం అందించడం ద్వారా వాటి సంరక్షణకు ప్రజలు సహకరించాలని రేంజర్ ఆర్. రాజబాబు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..