
పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతుకు ఒక్కసారిగా భారీ గిరినాగు కనిపించింది. అంత పొడవైన పామును సమీపంలో చూసి అతడు భయంతో వణికిపోయాడు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది ఎంతో జాగ్రత్తగా పామును పట్టుకుని, తిరిగి అడవిలో వదిలిపెట్టారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలోని చీడికాడలో చోటుచేసుకుంది. చీడికాడలోని ఓ రైతు పొలంలో సుమారు 14 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా కనిపించింది. భారీ ఆకారంలో ఉన్న గిరినాగును చూసిన రైతు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. పాము బుసలు కొడుతూ ఉండటంతో దాని దగ్గరకు వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, తూర్పు వన్యప్రాణుల సంరక్షణ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ గిరినాగును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దాని బరువు సుమారు 12 కిలోలుగా గుర్తించారు. పామును పట్టుకున్న తర్వాత అటవీశాఖ అధికారుల సమక్షంలో రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి తరలించారు. అక్కడ దానికి ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా విడిచిపెట్టారు. భారీ గిరినాగు పట్టుబడటంతో రైతుతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పాములు కనిపించినప్పుడు వాటిని పట్టుకునేందుకు లేదా చంపేందుకు ప్రయత్నించకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
గిరినాగులు చాలావరకు ఇతర పాముల్నే ఆహారంగా తీసుకుంటాయి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాములు ఇవి. అంతేకాదు.. గుడ్లను పొదిగేందుకు గూడు కట్టే అరుదైన లక్షణం వీటికి ఉంది. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి తారసపడుతుంటాయి. మనుషుల్ని చూస్తే దాదాపు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి. కార్నర్ చేసినా.. బెదిరించే ప్రయత్నం చేసినా తిరగబడతాయి.