
గాలిపటం అంటే పిల్లలకు సరదా.. దాన్ని ఆకాశంలో ఎగరవేస్తూ.. అది తోక ఆడిస్తూ స్వేచ్ఛగా కదులుతూ ఉంటే ఆ ఆనందం పట్టలేనిది. ఎంత ఎత్తుకు వెళితే అంత ఉత్సాహంతో సంబరపడతారు పిల్లలు.. ఎంతసేపు ఆకాశంలో గాలిపటం ఉంటే.. అంత సమయం కూడా తెలియకుండానే గడిపేస్తుంటారు. అంతటి సరదాను తెచ్చిపెట్టే గాలిపటాలు పిల్లల ప్రాణాలపైకి తెస్తున్నాయి. గాలిపటం ఎగురవేస్తున్న క్రమంలో మరో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ వైర్లలో చిక్కుకున్న గాలిపటాన్ని లాగే క్రమంలో విద్యుత్ షాక్ కు గురై ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన విశాఖపట్నంలో జరిగింది. ఆ కుటుంబాన్ని తీరని శోకంలో ముంచేసింది.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ నుంచి ఉపాధి కోసం వలస వచ్చింది సురేష్ కుమార్, కియాదేవి కుటుంబం.. గాజువాక శ్రీనివాసనగర్లో నివాసం ఉంటున్నారు. ఆ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో పెద్ద కొడుకు ఆకాష్ కుమార్.. ఐదో తరగతి చదువుతున్నాడు. సెలవు రోజు కావడంతో ఆదివారం సాయంత్రం.. సరదాగా దాబా పైకి వెళ్లి గాలిపటం ఎగరేస్తున్నాడు ఆకాష్ కుమార్.. కొద్దిసేపటికి ఆ గాలిపటం.. విద్యుత్ తీగల్లో చిక్కుకుంది. గాలిపటాన్ని లాగే క్రమంలో.. విద్యుత్ వైర్లు ఒక దానికి ఒకటి తగిలాయి. అక్కడే ఉన్న ఆకాష్ కుమార్.. ఆ వైర్లతో విద్యుత్ షాక్ కు గురయ్యాడు. క్షణాల్లో కాలిన గాయాలతో కుప్పకూలిపోయాడు.
పరిస్థితిని గుర్తించిన తల్లి వెంటనే దాబా పైకి వెళ్లి చూసింది. అప్పటికే.. కింద పడి ఉన్న కొడుకును చూసి తలడిల్లిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆకాష్ కుమార్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆకాష్ కుమార్ ను రక్షించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. చికిత్స పొందుతూ ఆకాష్ ప్రాణాలు కోల్పోయాడు.
అప్పటికే తీవ్ర విషాదంలోకీ వెళ్లిన ఆకాష్ కుమార్ తల్లిదండ్రులు.. కొడుకు మృతితో శోక సంద్రంలో మునిగిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గాలిపటం బాలుడి ప్రాణాలు తీసే స్థితికి తీసుకురావడంతో ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..