కోవిడ్‌ ఎక్స్‌పర్ట్‌ ఫౌచీపై నోరుపారేసుకున్న ట్రంప్‌

|

Oct 20, 2020 | 12:10 PM

తిట్టే నోరు, తిరిగే కాలు ఊరకుండవంటారు పెద్దలు.. అస్తమానం ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అనకపోతే నిద్రపట్టని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మహాశయులు ఇప్పుడు కోవిడ్‌ ఎక్స్‌పర్ట్‌ అయిన ఆంథోని ఫౌచీపై నోరు పారేసుకున్నారు.

కోవిడ్‌ ఎక్స్‌పర్ట్‌ ఫౌచీపై నోరుపారేసుకున్న ట్రంప్‌
Follow us on

తిట్టే నోరు, తిరిగే కాలు ఊరకుండవంటారు పెద్దలు.. అస్తమానం ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అనకపోతే నిద్రపట్టని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మహాశయులు ఇప్పుడు కోవిడ్‌ ఎక్స్‌పర్ట్‌ అయిన ఆంథోని ఫౌచీపై నోరు పారేసుకున్నారు. ఫౌచి, ఇతరులు చెప్పే మాటలు విని ప్రజలు అలసిపోయారని, ఇప్పటికైనా తమను ఒంటరిగా వదిలేయమని వేడుకుంటున్నారని ట్రంప్‌ అన్నారు.. ఫౌచిపై ట్రంప్‌కు అంత అక్కసు ఎందుకంటే.. ఆయన ట్రంప్‌ విధానాలను ఎండగడతారు కాబట్టి! మాస్కులు పెట్టుకోకుండా ట్రంప్‌ నిర్లక్ష్యం వహించడాన్ని ఫౌచి తప్పుపట్టారు.. అలాగే కోవిడ్‌ చికిత్స తర్వాత కరోనా నెగటివ్‌ అని నిర్ధారణ కాకముందే ట్రంప్‌ వైట్‌ హౌజ్‌కు రావడాన్ని కూడా ఫౌచి ఎండగట్టారు. మాస్క్‌ను పక్కన పెట్టేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వీటన్నింటినీ మనసులో పెట్టుకున్న ట్రంప్‌ ఇప్పుడు ఫౌచిని నానా మాటలన్నారు. ఫౌచి అయిదువందల ఏళ్లుగా ఇక్కడే ఉన్నారని, మనం ఆయన మాటలు విని ఉంటే కనుక ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది చనిపోయేవారని ట్రంప్‌ అన్నారు. అయితే ఫౌచిపై ట్రంప్‌ నోరు పారేసుకోవడం సొంతపార్టీవాళ్లకే నచ్చడం లేదు. ఎందుకంటే ఫౌచి వ్యక్తిత్వం అలాంటిది.. ఆయన రోనాల్డ్‌ రీగన్ నుంచి ఇప్పటి వరకు ఆరుగురు అధ్యక్షులకు సేవలు అందించారు.. నిజానికి ఆయన చేసిన సూచనలు, చెప్పిన సలహాలు విని ఉంటే అమెరికాలో కరోనా కేసులు ఈ స్థాయిలో ఉండేవి కావు, ఆర్ధిక వ్యవస్థ కూడా బాగా ఉండేది అంటూ ట్రంప్‌ పార్టీకే చెందిన సెనెటర్‌ లామర్‌ అలెగ్జాండర్‌ ట్వీట్‌ చేశారు..