అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇండో-అమెరికన్ లాయర్ అయిన షిరీన్ మ్యాథ్యూస్ ను ఫెడరల్ జడ్జిగా నియమించారు. వైట్ కాలర్ నేరాల దర్యాప్తులో స్పెషలిస్ట్ అయిన ఈమె.. జోన్స్ డే అనే న్యాయ సంస్థకు భాగస్వామిగా ఉన్నారు. గతంలో ఈమె కాలిఫోర్నియాలో అసిస్టెంట్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరించారు. క్రిమినల్ హెల్త్ కేర్ ఫ్రాడ్ కేసులను విచారించేవారు. శాన్ డీగో లో సదర్న్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టులో షిరీన్ జడ్జిగా పదవి చేపట్టడానికి సిధ్ధంగా ఉన్నారని ట్రంప్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఈమె నియామకాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంది. వివిధ స్థాయుల్లో ఫెడరల్ జుడీషియరీకి నామినేట్ అయిన ఇండో-అమెరికన్లలో ఈమె ఆరోవారు. ఆమె నియామకం చరిత్రాత్మకమని సౌత్ ఏషియా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనీష్ అభివర్ణించారు. ఆమె అపాయింట్ మెంట్ ను సెనేట్ వెంటనే ఆమోదించాలని ఆయన కోరారు. ప్రాసిక్యూటర్ గా ఉండగా షిరీన్.. చోరీ అయిన వైద్య పరికరాలకు సంబంధించి జరిగిన కోట్లాది డాలర్ల ఫ్రాడ్ ను దర్యాప్తు చేశారు. సోషల్ సెక్యూరిటీ ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేసిన అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ట్రంప్ ఇటీవల నియోమీ రావు, థాపర్, డయానే గుజరాతీ, అనురాగ్ సింఘాల్ లను జడ్జీలుగా నియమించారు.