చైనా చేసిన పాపాన్ని అమెరికా ఎప్పటికీ మర్చిపోదుః ట్రంప్

|

Oct 17, 2020 | 2:03 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. శుక్రవారం ఫ్లోరిడాలోని ఒకాలాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ట్రంప్.. ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా మహమ్మారిని ముమ్మాటికీ చైనా కృతిమ సృష్టియే అన్నారు.

చైనా చేసిన పాపాన్ని అమెరికా ఎప్పటికీ మర్చిపోదుః ట్రంప్
Follow us on

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. శుక్రవారం ఫ్లోరిడాలోని ఒకాలాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ట్రంప్.. ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా మహమ్మారిని ముమ్మాటికీ చైనా కృతిమ సృష్టియే అన్నారు. తమ దేశానికి ప్లేగు కొవిడ్-19ను పంపింది చైనానే అని చెప్పిన అధ్యక్షుడు… మా దేశానికి చైనా చేసిన దాన్ని అమెరికా ఎప్పటికీ మరిచిపోదన్నారు. చైనాకు ఏమైందో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. కొవిడ్ తర్వాత అక్కడి పరిస్థితులపై ఇప్పటికీ బయటి ప్రపంచానికి తెలియదన్న ట్రంప్.. యూఎస్‌కు ప్లేగు పంపిన వారి కంటే మేము ప్రస్తుతం చాలా బెటర్‌గా ఉన్నామన్నారు. త్వరలోనే ఈ వైరస్ ప్రభావం నుంచి బయటపడ్డామన్న ఆయన.. కానీ, ఈ పోరులో రెండు లక్షలకు పైగా అమెరికన్లను కోల్పోవడం బాధాకరమన్నారు. చైనా చేసిన దాన్ని ఎప్పటికీ మరిచిపోలేమన్నారు.

కరోనా వ్యాప్తి దేశాన్ని దెబ్బతీసే ముందు అమెరికాకు గొప్ప ఆర్థిక వ్యవస్థ ఉంది. ఈ వైరస్ ‘ఒక తాత్కాలిక భయంకరమైన పరిస్థితి నెలకొని ఉందన్నారు ట్రంప్. దేశంలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా వైరస్ వల్ల ఏర్పడిన భయంకర పరిస్థితులు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయని వెల్లడించారు.

ఇక ఈ ర్యాలీలో కూడా ట్రంప్ తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌‌ను మరోసారి తీవ్రంగా విమర్శించారు. డబ్ల్యూటీఓ‌లో చైనా సభ్యత్వానికి బైడెన్ మద్దతు తెలపడం నిజంగా చెత్త నిర్ణయమన్నారు. మొదటి నుంచి మాజీ ఉపాధ్యక్షులు చైనాకు అనుకూలంగా వ్యహారిస్తున్నారని ఆరోపించారు. అందుకే బైడెన్ గెలిస్తే దేశంలోకి చైనాను ఆహ్వానించినట్లేనని వ్యాఖ్యానించారు. మన ఉద్యోగాలను బైడెన్ చైనీయులకు కట్టబెట్టడం ఖాయమన్న ట్రంప్.. ఇటీవల బైడెన్ ప్రకటించిన కోటి మంది అక్రమ వలసదారులకు పౌరసత్వం విషయాన్ని కూడా ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదిలాఉంటే… ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలతో మొదటి స్థానంలో ఉన్న యూఎస్‌లో ఇప్పటివరకు 80 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2 లక్షల 18 వేల మందిని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకుంది. వ్యాధి నుండి కోలుకున్న రోగుల సంఖ్య 3,177,397 గా ఉందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నివేదించింది