నేను దేశభక్తుడిని, జోబైడెన్‌ దేశద్రోహి : ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

|

Nov 03, 2020 | 11:05 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆత్మస్తుతి పరనింద చేయడం జబ్బుగా మారినట్టుంది... ఎన్నికలకు ఆఖరి నిమిషం వరకు తనకు తాను డబ్బా కొట్టుకోవడం, ప్రత్యర్థిపై తిట్ల దండకాన్ని కురిపించడం చేశారు..

నేను దేశభక్తుడిని, జోబైడెన్‌ దేశద్రోహి : ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు
Follow us on

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆత్మస్తుతి పరనింద చేయడం జబ్బుగా మారినట్టుంది… ఎన్నికలకు ఆఖరి నిమిషం వరకు తనకు తాను డబ్బా కొట్టుకోవడం, ప్రత్యర్థిపై తిట్ల దండకాన్ని కురిపించడం చేశారు.. కరోనా వైరస్‌ను పుట్టించి ప్రపంచం మీదకు వదిలిపెట్టిన చైనా పట్ల జో బైడెన్‌ మెతక వైఖరిని కనబరుస్తున్నారంటూ మండిపడ్డారు.. చక్కగా ఉన్న మన ఆర్ధిక వ్యవస్థను కరోనా వైరస్‌ దారుణంగా దెబ్బతీసిందని, చైనా కలిగించిన ఈ నష్టాన్ని అమెరికా ఎప్పటికీ మర్చిపోదని ట్రంప్‌ అన్నారు. ఎప్పుడూ నీరసంగా కనిపించే జో బైడెన్‌ అధ్యక్ష పదవికి అర్హుడు కాడంటూ విమర్శించారు. ఈ ఎన్నికల్లో తాను ఓడిపోవాలని, బైడెన్‌ గెలవాలని చైనా కోరుకుంటుందని, ఆ దేశం అభిలాష నెరవేరదని అన్నారు. బైడెన్‌ గెలుపుతో అమెరికాను చేజిక్కించుకోవాలని చైనా భావిస్తోంది కానీ అలా ఎన్నటికీ జరగదని చెప్పారు.. తాను రైతులు, కార్మికులు, పోలీసు అధికారులు, అన్ని మతాలు, వర్గాలకు చెందిన దేశభక్తుల తరఫు అభ్యర్థినని చెప్పుకున్న ట్రంప్‌.. ప్రత్యర్థి జో బైడెన్‌ను మాత్రం దోపిడీదారుల కొమ్ముకాసే వ్యక్తిగా అభివర్ణించారు. అల్లరి మూకలు, ఆయుధాల దొంగలు, జెండాలను తగులబెట్టేవారు, మార్క్సిస్టులు జో బైడెన్‌కు మద్దతు ఇస్తున్నారంటూ ఆరోపించారు. చివరాఖరిగా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీపై కూడా కారాలు మిరియాలు నూరారు.. ఎన్నికల తర్వాత ఆయనను ఉద్యోగంలోంచి తొలగిస్తానంటూ ప్రతిన చేశారు ట్రంప్‌.