అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పులతో వణికి పోయింది. టెక్సాస్ రాష్ట్రంలోని ఒడెస్సా ప్రాంతంలో దుండగులు కాల్పులకు దిగారు. సాయుధులైన ఇద్దరు దుండగులు చేసిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మరో 21 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురు పోలీసులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఓ దుండగుడిని కాల్చిచంపేశారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
టొయోటా వాహనంలో వచ్చిన దుండగులు తొలుత అమెరికాకు చెందిన పోస్టల్ సర్వీస్ వ్యాన్‌ని అపహరించారు. అనంతరం అదే వ్యాన్‌లో ఘటనా స్థలానికి చేరుకొని.. సామాన్య పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అయితే మరో దుండగుడు తప్పించుకున్నట్లు తెలియడంతో.. పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
టెక్సాస్ కాల్పుల ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులు అందించారని.. దీనిపై ఎఫ్బీఐతో పాటు ఇతర భద్రతాధికారులు దర్యాప్తు ప్రారంభించారన్నారు. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇది మూర్ఖత్వపు చర్య అని.. ఇలాంటి ఘటనలను టెక్సాస్ ప్రజలు సమిష్టిగా ఎదుర్కొంటారని అభిప్రాయపడ్డారు. బాధితులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, ఇటీవల అమెరికాలో గన్ కల్చర్ విచ్చలవిడిగా మారింది. తరచూ కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ దాడుల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.