పాకిస్తాన్ పై అమెరికా క్రమేపీ ఒత్తిడి పెంచుతోంది. తన గడ్డపై సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను పాక్ ఉక్కుపాదంతో అణచివేయాలని సూచించింది. లష్కరే-తోయిబా టాప్ లీడర్ హఫీజ్ సయీద్ తో బాటు నలుగురిని సాధ్యమైనంత త్వరగా ప్రాసిక్యూట్ చేయాలని అమెరికా దాదాపు డిమాండ్ చేసింది. పాక్ ను బ్లాక్ లిస్టులో పెట్టే విషయమై గ్లోబల్ యాంటీ టెర్రరిస్ట్ వాచ్ డాగ్ అయిన ‘ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ‘ ఓ కీలక నిర్ణయం తీసుకోవడానికి ముందు అమెరికా చేసిన ఈ సూచన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. పాక్ లో లష్కరే-తోయిబా, జమాత్-ఉద్-దావా ఉగ్రవాద సంస్థలకు చెందిన నలుగురు టాప్ లీడర్ల అరెస్టు పట్ల యుఎస్ విదేశాంగ శాఖలోని దక్షిణ, సెంట్రల్ ఆసియా బ్యూరో చీఫ్ అలీస్ వెల్స్ హర్షం వ్యక్తం చేశారు. టెర్రరిజ కార్యకలా[పాల కోసం నిధులు సేకరిస్తున్నారన్న అభియోగంపై ప్రొఫెసర్ జాఫర్ ఎక్బాల్. యాహ్యా అజీజ్, మహమ్మద్ అష్రఫ్, అబ్దుల్ సలాం అనే ఈ నలుగురిని పాక్ అధికారులు గత గురువారం అరెస్టు చేశారు. ఇది హర్షణీయమేనని, లష్కరే నేత హఫీజ్ సయీద్ తో బాటు వీరిని కూడా ప్రాసిక్యూట్ చేయాలని అలీస్ వెల్స్ కోరారు.
తమ దేశంలోని ఉగ్రవాదులను మొదట అరెస్టు చేయడం, ఆ తరువాత వారిని విడుదల చేయడం పాక్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్యారిస్ లోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంస్థ.. ఇక ఈ దేశాన్ని బ్లాక్ లిస్టులో చేర్చే విషయమై నిర్ణయం తీసుకోనుండగా.. పాక్ ఈ నలుగురిని అరెస్టు చేయడం, అమెరికా ఈ సూచన చేయడం విశేషం. గత ఏడాది జూన్ లో ఈ సంస్థ పాకిస్తాన్ ను ‘ గ్రే ‘ లిస్టులో చేర్చింది.
2019 అక్టోబరు నాటికి ఉగ్రవాదుల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో అప్పటికల్లా తెలియజేయాలని పాకిస్తాన్ కు ఈ సంస్థ అల్టిమేటం ఇచ్చింది. ఇరాన్, నార్త్ కొరియా ఇప్పటికే ఈ సంస్థ బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి.