అమెరికా వర్సెస్ చైనా..బెలూన్ వార్..ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. చైనా బెలూన్‌ను అమెరికా కూల్చివేయడంతో ఘాటుగా స్పందించింది డ్రాగన్. అగ్రరాజ్యం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో ఇది తీవ్ర ఉల్లంఘనేనంటూ చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 28 నుంచి అమెరికాలో స్పై బెలూన్ దుమారం చెలరేగింది. మోంటానాలో స్పై బెలూన్‌ను గుర్తించిన పెంటగాన్..తమ రక్షణ స్థావరాలపై చైనా నిఘా పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలతో F-22 ఫైటర్ జెట్‌తో ఆ బెలూన్‌ను పేల్చేసింది. నార్త్ కరోలినా సముద్రంలో బెలూన్ శకలాలు పడ్డాయి. తూర్పు తీరానికి 6 నాటికల్ మైళ్ల దూరంలో క్షిపణిని ప్రయోగించామని..సముద్రంలో పడిన శిథిలాలను వెలికితీసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు అధికారులు.
ఐతే లాటిన్ అమెరికాలో మరో స్పై బెలూన్ కలకలం సృష్టిస్తోంది. లాటిన్ అమెరికా గగనతలంలో ఓ బెలూన్ ఎగురుతున్నట్లు సమాచారం అందింది. అది చైనాకు చెందిన నిఘా బెలూన్‌గా అంచనా వేస్తున్నామని తెలిపింది పెంటగాన్. డ్రాగన్ పంపిన బెలూన్స్ అమెరికాలో గుబులు పుట్టిస్తున్నాయి. అవి స్పై బెలూన్స్ అయివుండవచ్చని భావిస్తోంది అమెరికా.
తమ రక్షణరంగ రహస్యాలను తెలుసుకోవడానికే చైనా ఈ పనిచేసిందని అనుమానిస్తోంది. అయితే భయపడాల్సిన అవసరం లేదని వాతావరణ మార్పులపై పరిశోధించేందుకు ప్రయోగించిన బెలూన్..దిశ తప్పి అక్కడికి వెళ్లిందని చైనా వివరణ ఇస్తోంది. కానీ చైనా ఇస్తున్న వివరణను అమెరికా నమ్మడం లేదు.
మరోవైపు తమ బెలూన్‌ను అమెరికా పేల్చివేయడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే ఇప్పుడు అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. ఐతే ఈ స్పై బెలూన్ ఘటనను ప్రశాంతంగా డీల్ చేయాలని..పరిస్థితి అదుపు తప్పకముందే ఇరు దేశాలు శాంతంగా మాట్లాడుకోవాలని సూచిస్తున్నాయి ప్రపంచ దేశాలు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం