“అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్” అన్న మోదీ

భారత్‌కు నిజమైన ఆప్తమిత్రుడు ట్రంప్ అని అన్నారు ప్రధాని మోదీ. అమెరికాలోని హ్యూస్టన్‌ వేదికగా ఏర్పాటు చేసిన ‘హౌడీ- మోదీ’ కార్యక్రమంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రధాని మోదీ ఇద్దరు సంయుక్తంగా హాజరయ్యారు. సభా వేదిక వద్దకు విచ్చేసిన ట్రంప్‌కు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రధాని మోదీ డోనాల్డ్ ట్రంప్‌ను వేదికపైకి తీసుకెళ్లారు. హౌడీ-మోదీ కార్యక్రమానికి హాజరైన ప్రవాస భారతీయులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. తనను ఆహ్వానించిన హ్యూస్టన్ వాసులకు ధన్యవాదాలు తెల్పారు మోదీ. అమెరికా అధ్యక్షుడు ఎంత శక్తివంతుడో ప్రపంచానికి తెలుసన్నారు. ట్రంప్ అధ్యక్షుడు కావడం అమెరికా పౌరుల అదృష్టమని.. భారత్‌లో కూడా ట్రంప్ చాలా పాపులర్ అని అన్నారు. ట్రంప్‌కు ఇంట్రడక్షన్ అవసరం లేదని.. అన్న మోదీ.. ట్రంప్‌ను కలిసే అవకాశాలు నాకు తరచుగా లభించాయన్నారు. ప్రతి సందర్భంలోనూ అత్యంత స్నేహపూర్వకంగా ట్రంప్ వ్యవహరిస్తారన్నారు. భారత్‌కు నిజమైన శ్వేతసౌధ స్నేహితుడు ట్రంప్‌ అని.. కొన్నేళ్లుగా భారత్‌- అమెరికా సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయన్నారు. ఇప్పుడు ట్రంప్‌, మోదీ కాదు.. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల సమాగమం ఇది అన్నారు. హ్యూస్టన్‌ నుంచి ఈ కొత్త స్నేహగీతం కొనసాగుతుందని.. అందుకు ఈ సభ కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుందని అన్నారు. అంతేకాదు రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి ట్రంప్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. భారత్‌లో సార్వత్రిక ఎన్నికల ముందు అబ్ కీ బార్ మోదీ సర్కార్.. అన్న నినాదాన్ని.. అక్కడ అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ నినదించారు. ఈ దీపావళి సంబరాల్లో ట్రంప్‌ మళ్లీ అధికారం చేపట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *