World water: అంగారక గ్రహంపై నీటి జాడలను కనుగొనడానికి మానవుడు ఎందుకు అంత ఉత్సాహం చూపుతున్నాడు? భూమిపై ఉన్న ‘నీలి బంగారం’(నీరు)కు ఎందుకు అంతటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు? ఇదే విషయాన్ని ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక 2021 అడుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది నీటిని వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నీటిని ఎందుకు విలువైనదిగా చూడటం లేదంటూ ప్రశ్నిస్తోంది. ఎందుకు నీటి విలువను తక్కువగా అంచనా వేస్తారంటోంది. నీటిని తక్కువ అంచనా వేస్తే జరిగే పరిణామాలను అంచనా వేయడం కూడా కష్టమే అంటోంది సదరు నివేదిక. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ప్రపంచ నీటి అభివృద్ధి నివేదికను తాజాగా విడుదల చేశారు. ‘‘మంచి నీటికి చాలా మంది విలువ ఇవ్వడం లేదు. దాని వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నీటి వృధా చేయడం సరైన చర్య కాదు’ అంటూ యూఎన్ వాటర్ విభాగం చైర్మన్ గిల్బర్ట్ పేర్కొన్నారు. ఓవైపు నీటి కోసం పెరుగుతున్న డిమాండ్.. మరోవైపు రోజు రోజు వేడెక్కుతున్న భూమి. ఫలితంగా సామాన్య ప్రజలు నీటి అవసరాలు తీర్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. నీటిని వృథా చేయడం వలన కలిగే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం.
యూఎన్ ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక 2021 ప్రకారం నీటి గురించి 10 వాస్తవాలు..
1. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో నలుగురికి సరిపడా సురక్షితమైన తాగునీరు లేదు. 2050 నాటికి, ప్రపంచ జనాభాలో సగానికి పైగా నీటి ఎద్దడిని ఎదుర్కొంటాయని భావిస్తున్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను మించి జనాభా ఉన్నప్పుడు ఈ పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది.
2. నీటి సమస్యలను ఎదుర్కొంటున్న దేశాలలో 2 బిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. సంవత్సరానికి కనీసం ఒక నెలపాటు తీవ్రమైన నీటి కొరతతో బాధపడుతున్న ప్రాంతాల్లో 4 బిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు.
3. ప్రపంచవ్యాప్తంగా ఐదుగురు పిల్లలలో ఒకరికి వారి రోజువారీ అవసరాలను తీర్చడానికి తగినంత నీరు అందుబాటులో ఉండటం లేదు. ఇంకా 80 కంటే ఎక్కువ దేశాలలో పిల్లలు అధిక నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
4. తూర్పు, దక్షిణ ఆఫ్రికాలో అటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్న పిల్లలు అత్యధికంగా ఉన్నారు. 58% మంది ప్రతిరోజూ తగినంత నీటి సౌలభ్య పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
5. ప్రపంచవ్యాప్తంగా ఐదుగురిలో ఇద్దరు, లేదా 3 బిలియన్ల మందికి ఇంట్లో సబ్బుతో చేతులు కడుక్కోవడానికి నీటి సౌకర్యం లేదు. ఇందులో పేద దేశాలలో దాదాపు మూడొంతుల మంది ఉన్నారు.
6. 140 తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యం కల్పించడానికి సంవత్సరానికి 114 బిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుంది. అయితే సురక్షితమైన నీటి కొరత ఏర్పడటం వలన కలిగే సామాజిక మరియు ఆర్ధిక పరిస్థితులను అంచనా వేయడం కష్టం.
7. గత 100 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా మంచినీటి వాడకం ఆరు రెట్లు పెరిగింది. 1980 ల నుండి సంవత్సరానికి 1% చొప్పున పెరుగుతూనే ఉంది.
8. ప్రపంచ నీటి ఉపసంహరణలో వ్యవసాయం దాదాపు 70% ఉంది. ప్రధానంగా నీటిపారుదల కోసం మాత్రమే కాకుండా పశువులు, ఆక్వాకల్చర్ కోసం కూడా నీటిని ఉపయోగిస్తున్నారు. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ నిష్పత్తి 95% వరకు ఉంటుంది.
9. వాతావరణంలో కలిగే మార్పులు కూడా నీటి లభ్యతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
10. ఐస్ కవర్లు, హిమానీనదాలను కరగడం, ఆకస్మిక వరదలకు దారితీసే ప్రమాదం ఉందని, భవిష్యత్లో వందల మిలియన్ల మందికి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడొచ్చని చెబుతున్నారు యూఎన్ అధికారులు.
Also read: