అద్భుతం.. సోదరి దానం చేసిన గర్భసంచితో బిడ్డకు జన్మనిచ్చిన 36 ఏళ్ల మహిళ

తను ఓ మిరాకిల్ బేబీ. అవును గర్భాశయం లేకుండానే జన్మించిన ఓ మహిళ.. సోదరి ఇచ్చిన గర్భాశయంతో ఈ బిడ్డకు జన్మనిచ్చారు. బ్రిటన్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. దీంతో ఆ మహిళ మరో బిడ్డను కనాలని కూడా భావిస్తున్నారు. ఆ తర్వాత ఆ గర్భసంచి తొలగించనున్నారు.. ఎందుకంటే...

అద్భుతం..  సోదరి దానం చేసిన గర్భసంచితో బిడ్డకు జన్మనిచ్చిన 36 ఏళ్ల మహిళ
Miracle Baby

Updated on: Apr 10, 2025 | 2:59 PM

బ్రిటన్‌లో అద్భుత ఘటన వెలుగుచూసింది. గర్భాశయమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న ఓ మహిళ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.  ఆ దేశ చరిత్రలో తొలిసారి ఇలా జరిగిందని.. ఇదో మిరాకిల్ అంటున్నారు వైద్యులు.. అందుకే ఆ చిన్నారిని మిరాకిల్ బేబీగా పిలుస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రేస్ డేవిడ్‌సన్‌‌కు పుట్టుకతోనే గర్భాశయం లేదు. దీంతో 2023లో ఆమెకు గర్భాశయ మార్పిడి శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. గ్రేస్సో సోదరి అమీ గర్భాశయాన్ని గ్రేస్‌కు అమర్చారు. ఈ ఆపరేషన్ కోసం  30 మందికి పైగా  డాక్టర్లు..  17 గంటల పాటు శ్రమించారు.  గర్భసంచి మార్పిడి జరిగిన 2 వారాల తర్వాత గ్రేస్‌కు నెలసరి మొదలయ్యింది.  IVF ప్రక్రియ ద్వారా తొలి ప్రయత్నంలోనే ఆమె ప్రెగ్నెంట్ అయ్యారు. ఈ ఆపరేషన్ జరిగిన రెండేళ్ల తర్వాత.. ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రేస్ బిడ్డకు జన్మనిచ్చారు. స్కాట్లండ్‌కు చెందిన గ్రేస్, అంగస్ దంపతులు.. ప్రస్తుతం నార్త్ లండన్‌లో ఉంటున్నారు. వీరు మరో బిడ్డను కూడా కనాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

రెండో బిడ్డ పుట్టిన తర్వాత గ్రేస్‌కు అమర్చిన గర్బసంచి తొలగించనున్నారు వైద్యులు. తద్వారా ఆమె చాలారకాల మెడిసిన్స్ వాడే అవసరం తగ్గుతుందని.. పలు ఆరోగ్య సమస్యల ముప్పు తప్పుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ బిడ్డ పుట్టుక గర్భాశయ సమస్యలు ఎదుర్కొంటున్న ఎంతోమంది మహిళలకు కొత్త ఊపిరి ఊదిందని నెట్టింట చర్చ జరుగుతుంది. అయితే మరణించిన దాతల నుంచి గర్భాశయాన్ని తీసుకుని.. లేనివారికి అమర్చవచ్చా..? అలా చేయడం వల్ల వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా అన్న అంశాలపై మరింత రీసెర్స్, క్లినికల్ ట్రయిల్స్ జరగాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..