
సాహసం చేయాలనే ఉత్సాహం… క్షణాల్లోనే విషాదంగా మారింది. బంగీ జంప్ కోసం సిద్ధమైన 21 ఏళ్ల యువతి, నిర్వాహకుల ఘోర నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. బ్రెజిల్‌లోని సావోపాలో రాష్ట్రం లిమేరా ప్రాంతంలోని ‘పోంటే డో ఎస్కెలెటో’ బ్రిడ్జి సాహస క్రీడలకు ప్రసిద్ధి. అక్కడ అడ్వెంచర్ గేమ్ కోసం వచ్చిన మరియా రోడ్రిగ్స్ అనే యువతి తన స్నేహితులతో కలిసి బంగీ జంప్‌కు సిద్ధమైంది. మరియా రోడ్రిగ్స్ జంపింగ్ పాయింట్ దగ్గరకు రాగానే, నిర్వాహకులు ఆమెకు హెల్మెట్ తొడిగారు. జంప్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రాథమిక సూచనలన్నీ క్లియర్ గా వివరించారు. అంతా సవ్యంగానే జరుగుతోందని భావించిన మరియా, నిర్వాహకులను పూర్తిగా నమ్మింది. అయితే తాళం వేసి గొళ్లెం మరిచిపోయినట్టుగా అసలైన భద్రతా ప్రమాణాన్ని మాత్రం గాలికొదిలేశారు నిర్వాహకులు. ఆమె కాళ్లకు సురక్షితమైన తాడును కట్టడం పూర్తిగా మర్చిపోయారు. సుమారు 130 అడుగుల ఎత్తు నుంచి ఆమెను కిందకు తోసేశారు. తాడు కట్టలేదని గమనించేలోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. లోయలో పడిన మరియా రోడ్రిగ్స్ తీవ్ర గాయాలతో చనిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. తాము చేసిన ఘోర తప్పిదానికి యువతి చనిపోయిందని గ్రహించిన నిర్వాహకులు ఇద్దరు భయంతో పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు హెలికాప్టర్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి వారిని అదుఫులోకి తీసుకున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించి మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి