అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ సంపన్న కుటుంబం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి మసాచుసెట్స్ రాష్ట్రంలోని వారి ఇంట్లో మృతదేహాలను గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాన్సద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మృతులను రాకేశ్ కమల్(57), ఆయన భార్య టీనా(54), కుమార్తె అరియానా(18)గా పోలీసులు గుర్తించారు. రెండు రోజులుగా వారి నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఒక బంధువు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాకేశ్ కమల్ మృతదేహం వద్ద తుపాకీ ఉంది. దీంతో ఈ ఘటన గృహ హింస వల్ల జరిగిందా..? లేక ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యనా..? అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బయటి వ్యక్తి ప్రమేయం ఉందా..? అనే కోణంలోనూ పరిశోధిస్తున్నారు.
రాకేశ్ కమల్ దంపతులు 2016లో ఎడ్యునోవా పేరిట విద్యా రంగానికి చెందిన ఓ సంస్థను ప్రారంభించారు. అయితే 2021లో దాని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఎడ్యునోవా వెబ్‌సైట్ ప్రకారం రాకేశ్.. బోస్టన్ విశ్వవిద్యాలయం, ఎంఐటీ సోలన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలు పొందారు. ఆయనకు విద్యారంగంలో విశేష అనుభవం ఉంది. టీనా, హార్వర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. ఆమెకు రెడ్‌క్రాస్ ఛారిటీ బోర్డులో పనిచేసిన అనుభవం ఉంది.
వారు నివసించే 11 పడక గదుల విలాసవంతమైన భవనం విలువ 5 మిలియన్ డాలర్లుగా ఉంటుందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. 19వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఉన్న ఆ భవంతిని 2019లో కొనుగోలు చేసినట్లు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ఇంట్లో వారు మాత్రమే నివసిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారి నివాసాన్ని తక్కువ ధరకే అమ్మివేసినట్టు తెలుస్తోంది. వీరు గతంలో దివాలా పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…