
దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో బుధవారం సాయంత్రం రెండు భారీ భూకంపాలు బీభత్సం సృష్టించాయి. 7.1, 7.5 తీవ్రతతో నిమిషం వ్యవధిలోనే ఒకదాని వెనుక ఒకటిగా సంభవించిన ఈ భారీ భూకంపాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఈ భూకంప ధాటికి దేశ రాజధాని నగరంలోని చాలా ప్రాంతాల్లో భవనాలు నేలకూలాయి. దీంతో ఇళ్లలో ఉన్న జనం ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. మరికొందరు తప్పించుకోలేక భవన శిథిలాల కిందనే చిక్కుకుపోయారు.
భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం?
భూకంపం సృష్టించిన బీభత్సానికి భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని జియోలాజికల్ సర్వే అధికారులు చెబుతున్నారు. భూకంపం తర్వాత కూడా పెద్ద ఎత్తున తదుపరి ప్రకంపనలు (Aftershocks) వచ్చాయని.. దీనివల్ల పెద్ద పెద్ద భవనాలు ఒక్కసారిగా కూలిపోవడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య సుమారు 10 వేల నుంచి లక్ష వరకు ఉండొచ్చని జియోలాజికల్ సర్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, ఈ మరణాలపై వెనిజులా ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ మరణాల సంఖ్య కేవలం ప్రమాద తీవ్రతను బట్టి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నది మాత్రమే. ఇప్పటికే గాయపడిన వారు చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అధికారులు, స్థానికులు చెబుతున్నారు.
సెలవుదినం కావడంతో పెరిగిన ప్రమాదం
ఈ ప్రమాదం బుధవారం సంభవించడంతో మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. జూన్ 24వ తేదీన వెనిజులాలో జాతీయ సెలవు దినం (National Holiday) కావడంతో, సాధారణ రోజుల కంటే ఆ రోజు ఎక్కువ మంది ప్రజలు ఇళ్లలోనే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే భూకంపం సంభవించడంతో నష్టం తీవ్రత మరింత ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది.
అత్యవసర పరిస్థితి ప్రకటన
భూకంపాన్ని గుర్తించిన వెంటనే వెనిజులా ప్రభుత్వం దేశ ప్రజలను అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించింది. ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించింది. అలాగే ప్రమాద తీవ్రత పెరగకుండా ఉండేందుకు ఇళ్లకు విద్యుత్, పెట్రోల్, గ్యాస్ సరఫరాలను నిలిపివేసింది. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. రైల్వే, విమాన సేవలను కూడా తాత్కాలికంగా రద్దు చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.