విఫలమైన చర్చలు.. యుద్ధం తప్పదా? ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!

మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన కోసం పాకిస్థాన్ వేదికగా జరిగిన కీలక చర్చలు నిష్ఫలమయ్యాయి. ఇజ్రాయెల్, అమెరికా - ఇరాన్‌ల మధ్య యుద్ధ వాతావరణాన్ని చల్లార్చేందుకు ఇస్లామాబాద్‌లో శనివారం (ఏప్రిల్ 11, 2026) ప్రారంభమైన చర్చలు ఎటువంటి సానుకూల నిర్ణయం లేకుండానే ముగిశాయి.

విఫలమైన చర్చలు.. యుద్ధం తప్పదా? ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
Trump

Updated on: Apr 12, 2026 | 9:44 PM

మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన కోసం పాకిస్థాన్ వేదికగా జరిగిన కీలక చర్చలు నిష్ఫలమయ్యాయి. ఇజ్రాయెల్, అమెరికా – ఇరాన్‌ల మధ్య యుద్ధ వాతావరణాన్ని చల్లార్చేందుకు ఇస్లామాబాద్‌లో శనివారం (ఏప్రిల్ 11, 2026) ప్రారంభమైన చర్చలు ఎటువంటి సానుకూల నిర్ణయం లేకుండానే ముగిశాయి. సుమారు 21 గంటల పాటు మారథాన్ తరహాలో సాగిన ఈ చర్చలు విఫలం కావడంతో, ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

చర్చల వైఫల్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఆదివారం (ఏప్రిల్ 12) తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో పోస్ట్ చేస్తూ, ఇరాన్ మొండి వైఖరిపై నిప్పులు చెరిగారు. ఇరాన్ తన అణు ఆశయాలను వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేదని ఆయన స్పష్టం చేశారు. “ఇరాన్‌తో సమావేశం రాత్రంతా కొనసాగింది. అనేక అంశాలపై చర్చలు జరిగినప్పటికీ, అత్యంత కీలకమైన అణు నిరోధకత విషయంలో ఇరాన్ ససేమిరా అంది. అస్థిరమైన, ఊహించలేని వ్యక్తుల చేతుల్లోకి అణుశక్తి వెళ్లడం ప్రపంచానికే ప్రమాదకరం,” అని ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికా ప్రతినిధులు, ఇరాన్ ప్రతినిధులైన మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్, అబ్బాస్ అరఘ్చీ, అలీ బఘేరీలతో స్నేహపూర్వకంగానే చర్చలు జరిపినప్పటికీ, ప్రధానాంశమైన అణ్వాయుధాల తయారీపై ఇరాన్ వెనక్కి తగ్గలేదు. తమ సైనిక చర్యను కొనసాగించడం కంటే దౌత్యపరమైన ఒప్పందం కుదుర్చుకోవడం మేలని భావించినా, ఇరాన్ మొండితనం వల్ల అది సాధ్యపడలేదని ట్రంప్ వివరించారు.

ట్రంప్ తన పోస్ట్‌లో ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. “ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండదు!” అని ఆయన ఖరాకండిగా తేల్చి చెప్పారు. ఈ చర్చల వైఫల్యంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నాయి. అమెరికా తదుపరి అడుగు ఏంటనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ దౌత్య మార్గాలు పూర్తిగా మూసుకుపోతే, సైనిక చర్య తప్పదనే సంకేతాలను ట్రంప్ అల్టిమేటం స్పష్టం చేస్తోంది.

ఇదిలావుంటే, డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలతో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సంచలన ప్రకటన చేశాయి. హోర్ముజ్ జలసంధి తమ పూర్తి నియంత్రణలోనే ఉందని, శత్రువులు చిన్న తప్పు చేసినా అది వారికి ప్రాణాంతక సుడిగుండంగా మారుతుందని హెచ్చరించాయి. పర్షియన్ భాషలో చేసిన పోస్ట్‌లో తమ రక్షణ బలగాల సంసిద్ధతను చాటుతూ, అమెరికా చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధమని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన ఈ మార్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us