బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ దంపతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ రాయల్స్ హోదా నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రిన్స్ హ్యారీ, సతీమణి మేఘన్..సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తాము నార్త్ అమెరికాకు వెళ్లి ఆర్థికంగా స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నట్లు బ్రిటన్ రాణి ఎలిజబెత్‌కు ఓ లేఖ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యారీ భార్య మేఘన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఐతే గతేడాది బ్రిటీష్ రాచకుటుంబంలో చీలికలు ఏర్పడ్డాయని..అవి చినికి చినికి గాలవానగా మారాయని సమాచారం. ప్రిన్స్ హ్యారీ దంపతుల నిర్ణయం పట్ల క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ చార్లెస్ నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. రాచకుటుంబంలో పెద్దలను ఎవర్నీ సంప్రదించకుండానే ప్రిన్స్ హ్యారీ దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ పేర్కొంది. హ్యారీ ప్రకటనపై స్పందించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-2..ఇది చాలా కఠినతరమైన సమస్యన్నారు. స్వతంత్రంగా జీవించాలనే మీ కోరికను అర్ధం చేసుకున్నానని..కానీ దీనిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందన్నారు.