
ఒక పోస్టులో ఇరాన్ మ్యాప్ కనిపించగా.. దానిపై ట్రంప్ ముఖాన్ని ఉంచారు. ఇరాన్‌కు కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని క్షిపణులతో పేల్చేసినట్లు అదే పోస్ట్‌కి గ్రాఫిక్స్ జోడించారు. మరో పోస్టులో ఇరాన్ చమురు ఎగుమతులు భారీగా పడిపోయాయని పేర్కొన్నారు. అలాగే హర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా మళ్లీ పెరిగిందంటూ మరో గ్రాఫిక్‌ను పోస్ట్ చేశారు.
హర్ముజ్ జలసంధికి ‘ట్రంప్ స్ట్రెయిట్’ అని పేరు మార్చాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే వైట్‌హౌస్ వర్గాలు అదే పేరుతో ఒక ప్రత్యేక మ్యాప్‌ను విడుదల చేసాయి. గ్లోబల్ ఆయిల్ రవాణాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ జలమార్గం ప్రస్తుతం అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న సైనిక ఘర్షణకు కేంద్రబిందువుగా మారింది. అమెరికా విధిస్తున్న ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధం కారణంగా ఇరాన్ చమురు ఎగుమతులు భారీగా దెబ్బతిన్నాయి. అయితే హర్ముజ్ జలసంధి ప్రాంతంలో తమ ప్రభావాన్ని, ఆధిపత్యాన్ని ఏమాత్రం తగ్గించుకోబోమని, దాన్ని కొనసాగిస్తామని టెహ్రాన్ తేల్చిచెబుతోంది.
ఇరాన్ మ్యాప్‌పై తన ముఖాన్ని ముద్రించడం , ఆ దేశాన్ని ‘ఫెయిలింగ్ నేషన్’ (విఫల దేశం) అని అభివర్ణించడం ద్వారా ట్రంప్ తన ఆధిపత్యాన్ని దూకుడును ప్రదర్శిస్తూ, ప్రత్యర్థులకు బలమైన సందేశం పంపించారనీ విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్ ఎదుర్కొంటున్న చమురు ఎగుమతుల సంక్షోభం, కరెన్సీ పతనం, హర్ముజ్ జలసంధి ఉద్రిక్తతలపై ట్రంప్ తన స్టైల్ లో గ్రాఫిక్స్ జోడించి పోస్టులు చేయడం సంచనలంగా మారింది. మరోవైపు, అమెరికా బెదిరింపులకు, ఒత్తిళ్లకు తాము తలొగ్గేది లేదని టెహ్రాన్ తేల్చిచెబుతోంది. ఈ ఉద్రిక్తతల నడుమ ట్రంప్ విడుదల చేసిన తాజా ‘మ్యాప్ పోస్ట్’ కేవలం వినోదం కోసం కాకుండా, రెండు దేశాల మధ్య నడుస్తున్న ఘర్షణలో మరో శక్తివంతమైన రాజకీయ సందేశంగా మారింది.
పేర్లు మార్చడం ట్రంప్ కు కొత్తేమీ కాదు. సంచలనాలకు ట్రంప్ మారుపేరుగా నిలిచారు అనడానికి గతంలో తీసుకున్న నిర్ణయాలే నిదర్శనం. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రాంతాల పేర్లను మార్చడానికి ఏకంగా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మార్చారు. అలాస్కాలోని ‘డెనాలి’ పర్వతం పేరును దాని పాత పేరు ‘మౌంట్ మెకిన్లీ’గా మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.