Sri Lankan Crisis: మరింత ముదురుతోన్న సంక్షోభం.. మరో రెండు వారాల పాటు పాఠశాలలు మూసివేత

Sri Lankan Crisis: శ్రీలంకలో సంక్షోభం మరింత ముదురుతోంది. చేతిలో డబ్బుల్లేక పెట్రోల్, డీజిల్‌ దొరక్క జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు..

Sri Lankan Crisis: మరింత ముదురుతోన్న సంక్షోభం.. మరో రెండు వారాల పాటు పాఠశాలలు మూసివేత
Follow us

|

Updated on: Jul 05, 2022 | 4:15 PM

Sri Lankan Crisis: శ్రీలంకలో సంక్షోభం మరింత ముదురుతోంది. చేతిలో డబ్బుల్లేక పెట్రోల్, డీజిల్‌ దొరక్క జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. పెట్రోల్‌ బంకుల్లో జనం వేలాదిగా క్యూల్లో ఎదురు చూడాల్సిన స్థితి. చమురు కొరతతో గత నెలల్లో పట్టణ ప్రాంత స్కూళ్లు రెండు వారాలు మూతపడ్డాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతులకు వచ్చే వీలు లేకపోవడంతో పాఠశాలలను మరో వారం రోజులపాటు మూసివేస్తున్నట్లు శ్రీలంక విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో పరిమితంగా అందుబాటులో ఉన్న చమురును కేవలం కొన్ని అవసరాలకే విక్రయిస్తున్నారు.

ఆరోగ్య సేవలు, ఓడరేవుల కార్మికులు, ప్రజా రవాణాకు, ఆహారం పంపిణీకి మాత్రమే చమురు లభిస్తోంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన శ్రీలంకకు క్రెడిట్‌పై చమురు విక్రయించేందుకు ఆయిల్‌ కంపెనీలు అయిష్టంగా ఉన్నాయి. నగదు లభించడం పెద్ద సవాలుగా మారిపోయిందని శ్రీలంక విద్యుత్, చమురు శాఖ మంత్రి కాంచన విజేశేఖర చెప్పారు. ఏడు చమురు కంపెనీలకు 800 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉందన్నారు. చమురు కొనేందుకు బ్యాంకుల ద్వారా నగదు పంపించాలని విదేశాల్లోని లంకేయులకు విజ్ఞప్తి చేశారు.

స్వాతంత్య్రం వచ్చిన 74 ఏళ్లకు శ్రీలంక కనీవినీ ఎరగని సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశాలకు చెల్లించాల్సిన 5,100 కోట్ల డాలర్ల అప్పుల కిస్తీలను కట్టలేమని ఈ ఏప్రిల్‌లో శ్రీలంక కేంద్ర బ్యాంకు గవర్నర్‌ చేతులెత్తేశారు. తరవాత గతంలో విడుదల చేసిన రెండు అంతర్జాతీయ బాండ్లకూ చెల్లింపులు జరపలేనని శ్రీలంక ప్రకటించింది. దీంతో లంక అంతర్జాతీయ రుణ రేటింగ్‌ పడిపోయింది.

ఇవి కూడా చదవండి

వంట గ్యాస్‌ కొరత..

నేడు శ్రీలంకలో పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌లకు తీవ్ర కొరత ఏర్పడింది. ఆరోగ్య సేవలు, పోలీసుల వంటి అత్యవసర సర్వీసులకు తప్ప మిగిలిన వారికి ఇంధన విక్రయాలను ప్రభుత్వం నిలిపివేసింది. జులై 22న కానీ ఇంధన విక్రయాలను పునరుద్ధరించలేమని ప్రభుత్వ రంగంలోని సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ప్రకటించింది.

అధిక ధరలు..

శ్రీలంకలో 2019తో పోలిస్తే ప్రస్తుతం ఇంధన ధరలు మూడు రెట్లు పెరిగాయి. ఆహార సరఫరా పూర్తిగా విచ్ఛిన్నమైంది. ప్రజల అవసరాలకు సరిపడినంత ఆహారం అక్కడ అందుబాటులో లేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్న లేదా విదేశాలు ఉచితంగా ఇచ్చిన ఆహార ధాన్యాలే లంకకు శరణ్యమవుతున్నాయి. 2022 ఆరంభంలో రూ.60 ఉన్న రొట్టె ధర ఇప్పుడు రూ.160కి చేరింది.

లంక ఖజానాలోని విదేశీ ద్రవ్యమంతా హరించుకుపోయింది. మరోవైపు దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స రసాయన ఎరువులు, క్రిమినాశనుల దిగుమతులను నిలిపివేసి రైతులంతా సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టాలని గతంలో ఆదేశించారు. ఫలితంగా దిగుబడులు పడిపోయి ఆహార ధాన్యాలు, పండ్లు కూరగాయలకు విపరీతమైన కొరత ఏర్పడింది.

అమెరికా, చైనాల కుమ్ములాటలో శ్రీలంక బలయ్యే ప్రమాదం కనిపిస్తోంది. గతంలో చైనా దగ్గర భారీగా అప్పులు తీసుకొని రుణ ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక- ఇప్పుడు అమెరికా గుప్పిట్లోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది. ట్రింకోమలీ నుంచి మన్నార్‌దాకా విస్తరించిన భూములపై అమెరికన్ల కన్ను పడింది. వాటిలో అమూల్యమైన సహజ వనరులు ఉన్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles