కింద రద్దీ రోడ్డు.. పైన భారీ ప్రమాదం! భారీ క్రేన్‌ను బలంగా ఢీకొన్న డ్రైవర్‌లెస్‌ రైలు..!

బ్రెజిల్‌లోని సావో పాలో నగరంలో అక్టోబర్‌ 24న చోటుచేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఎలివేటెడ్‌ మోనోరైల్‌ మార్గంపై పడిపోయిన భారీ నిర్మాణ క్రేన్‌ను అదే మార్గంలో వస్తున్న ఆటోమేటెడ్‌ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో ప్రమాద తీవ్రతపై చర్చ జరుగుతోంది.

కింద రద్దీ రోడ్డు.. పైన భారీ ప్రమాదం! భారీ క్రేన్‌ను బలంగా ఢీకొన్న డ్రైవర్‌లెస్‌ రైలు..!
Brazil Train Accident

Updated on: Oct 25, 2026 | 5:33 PM

సావో పాలో: బ్రెజిల్‌లోని సావో పాలో నగరంలో అక్టోబర్‌ 24న చోటుచేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఎలివేటెడ్‌ మోనోరైల్‌ మార్గంపై పడిపోయిన భారీ నిర్మాణ క్రేన్‌ను అదే మార్గంలో వస్తున్న ఆటోమేటెడ్‌ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో ప్రమాద తీవ్రతపై చర్చ జరుగుతోంది.

సావో పాలో నగరంలోని తూర్పు ప్రాంతంలో అవెనిడా ప్రొఫెసర్‌ లూయిజ్‌ ఇగ్నాసియో అన్హాయా మెల్లో రహదారిపై, లైన్‌ 15-ప్రాటా మోనోరైల్‌ మార్గం సమీపంలో ఈ ఘటన జరిగింది. నిర్మాణ పనుల కోసం వినియోగిస్తున్న భారీ క్రేన్‌ అదుపుతప్పి రైలు మార్గంపై పడింది. కొద్దిసేపటికే అటుగా వచ్చిన డ్రైవర్‌లెస్‌ రైలు ఆ క్రేన్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో క్రేన్‌లోని లోహపు భాగాలు విరిగి కింద రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపై కార్లు, ఇతర వాహనాలు వెళ్తుండటంతో వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి వచ్చింది.

ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

ఈ ఘటనలో రైలులో ప్రయాణిస్తున్నవారికి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులను సురక్షితంగా రైలు నుంచి దించారు. క్రేన్‌ ఆపరేటర్‌కు గాయాలు కావడంతో సంబంధిత సంస్థ సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో రైలు ముందు భాగం దెబ్బతినడంతో దాన్ని మరమ్మతుల కోసం తరలించారు. క్రేన్‌ పడిపోవడంతో విద్యుత్‌ వ్యవస్థకు కూడా అంతరాయం ఏర్పడింది.

కొంతసేపు నిలిచిన రైళ్ల రాకపోకలు

ప్రమాదం కారణంగా లైన్‌ 15-ప్రాటాలో విలా ప్రుడెంటే నుంచి సావో లూకాస్‌ స్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యామ్నాయంగా అత్యవసర బస్సులను నడిపించారు. మరమ్మతులు, తనిఖీలు పూర్తయిన తర్వాత అక్టోబర్‌ 25న ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు సాధారణ స్థితికి వచ్చినట్లు స్థానిక మీడియా నివేదించింది.

ప్రమాదానికి కారణమేంటి?

క్రేన్‌ ఎందుకు పడిపోయింది? నిర్మాణ ప్రాంతంలో భద్రతా చర్యలు సరైన విధంగా అమలయ్యాయా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. రైల్వే మార్గంపై భారీ పరికరాలు పడే పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడం ఊరటనిచ్చినా, రద్దీగా ఉండే రహదారిపై శిథిలాలు పడటంతో పెను ప్రమాదం తప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us