
పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో భారీ ఉగ్రవాద దాడి జరిగింది. క్వెట్టా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆదివారం (మే 24) చమన్ గేట్ వద్ద జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును లక్ష్యంగా చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA)కి చెందిన మజీద్ బ్రిగేడ్ ఆత్మాహుతి దళానికి ఉగ్రదారుడు ఈ పేలుడుకు పాల్పడ్డాడు. ఈ శక్తివంతమైన బాంబు పేలుడు ధాటికి రైలులోని ఒక బోగీ పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిలో కనీసం 24 మంది ప్రాణాలు కోల్పోగా, 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది సైనిక సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
సైనిక సిబ్బందిని తరలిస్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు చమన్ గేట్ సమీపానికి చేరుకోగానే, ట్రాక్‌ల పక్కన వేచి ఉన్న ఆత్మాహుతి దళసభ్యుడు తనకు తాను పేల్చేసుకున్నాడు. ఈ పేలుడు ఎంత తీవ్రంగా ఉందంటే, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లు, వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. పేలుడు శబ్దానికి క్వెట్టా నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రమాద స్థలంలో దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఘటన జరిగిన వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. స్థానికుల సహాయంతో గాయపడిన వారిని క్వెట్టాలోని సమీప ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రావిన్స్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.
ఈ దాడికి తామే బాధ్యులమని BLA ప్రతినిధి జియాండ్ బలూచ్ అధికారిక ప్రకటనలో తెలిపాడు. గరిష్ట నష్టం కలిగించేలా ముందస్తు ప్రణాళికతోనే ఈ సమయాన్ని ఎంచుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, పాకిస్తాన్ రైల్వే మంత్రి.. ఈ పిరికిపంద దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులు దేశ జాతీయ సంకల్పాన్ని, ఉగ్రవాద నిర్మూలన ధైర్యాన్ని బలహీనపరచలేవని స్పష్టం చేశారు. పేలుడుకు సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించేందుకు దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి.
وفاقی وزیر ریلوے کی کوئٹہ میں ہونے والے دھماکے کی شدید مذمت
واقعہ بزدلانہ دہشت گردی، ایسے حملے قومی عزم کو کمزور نہیں کر سکتے
کوئٹہ کینٹ سے آنے والی شٹل ٹرین چمن پھاٹک کے قریب دھماکے کی زد میں آئی
امدادی کارروائیوں کے لیے ریسکیو ٹرک اور ریلیف ٹرین جائے وقوعہ پر روانہ
— Pakistan Railways (@PakrailPK) May 24, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…