జులై 19 వరకు అక్కడ అన్ని బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు.. ఎందుకంటే?

ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ (74) మరణంతో ఆ దేశం నాలుగు రోజుల జాతీయ సంతాపాన్ని ప్రకటించింది. ఆధునిక ఖతార్ రూపశిల్పిగా పేరొందిన ఆయన దేశ అభివృద్ధి, ప్రపంచ గుర్తింపులో కీలక పాత్ర పోషించారు..

జులై 19 వరకు అక్కడ అన్ని బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు.. ఎందుకంటే?
Qatar National Mourning

Updated on: Jul 14, 2026 | 1:28 PM

ఖతార్ మాజీ అమీర్ (ఫాదర్ అమీర్) షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ (74) గత ఆదివారం (జులై 12) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఖతార్ ప్రభుత్వం నాలుగు రోజుల అధికారిక జాతీయ సంతాపాన్ని ప్రకటించింది. జూలై 12 నుంచి సంతాప దినాలు అమల్లోకి వచ్చాయని ఖతార్ అమిరీ దివాన్ వెల్లడించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ పతాకాలను అవనత స్థితిలో ఎగురవేయడంతో పాటు ప్రభుత్వ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. జూలై 13 నుంచి అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ బాడీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు జూలై 19న తిరిగి విధుల్లో చేరనున్నారు.

1995 నుంచి 2013 వరకు ఖతార్‌ను పాలించిన షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీని ఆధునిక ఖతార్ రూపశిల్పిగా గుర్తిస్తారు. సహజ వాయువు (LNG) వనరులను సమర్థంగా వినియోగించి ఖతార్‌ను ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన హయాంలోనే ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ జజీరా స్థాపించబడింది. అలాగే 2022 ఫిఫా ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను ఖతార్ సాధించడం, దేశాన్ని ప్రపంచ దౌత్య, పెట్టుబడులు, క్రీడా రంగాల్లో ప్రభావవంతమైన కేంద్రంగా తీర్చిదిద్దడం ఆయన నాయకత్వంలోని ముఖ్య విజయాలుగా నిలిచాయి. అతని 18 ఏళ్ల పాలనలో, 2006 ఆసియా క్రీడలు, 2012 ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు, దోహా ఒప్పందం, ఫతా-హమాస్ దోహా ఒప్పందం వంటి అనేక ప్రధాన సంఘటనలు దేశంలో జరిగాయి.

ఆ తర్వాత 2013లో గల్ఫ్ దేశాల చరిత్రలో అరుదైన నిర్ణయం తీసుకుంటూ ఆయన స్వచ్ఛందంగా అధికారాన్ని తన కుమారుడు, ప్రస్తుత అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి అప్పగించారు. అనంతరం కూడా దేశ అభివృద్ధికి మార్గదర్శకుడిగా కొనసాగారు. షేక్ హమద్ మరణంపై ప్రపంచ దేశాధినేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా ఆయనకు గౌరవ సూచకంగా ఒక రోజు జాతీయ సంతాపాన్ని ప్రకటించింది. ఆ రోజు దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని అవనత స్థితిలో ఎగురవేయడంతో పాటు అధికారిక వినోద కార్యక్రమాలను నిర్వహించబోమని ప్రకటించింది.

Follow Us