
క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. వాటికన్ సిటీలో ఆయన కన్నుమూశారు. 88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం ఈస్టర్ వేడుకలకు హాజరయ్యారు. ఈస్టర్ సందేశం కూడా ఇచ్చారు. గత కొంతకాలంగా పోప్ శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. 2013లో ఫ్రాన్సిస్ పోప్‌గా బాధ్యతలు చేపట్టారు. 1936లో లాటిన్ అమెరికా దేశం అర్జెంటీనాలో పోప్ ఫ్రాన్సిస్ జన్మించారు. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో, ఆయన జెస్యూట్ పూజారిగా, అర్జెంటీనాలో కార్డినల్‌గా సేవలందించారు. పోప్‌గా, ఆయన వినయం, సామాజిక న్యాయం, పర్యావరణ సంరక్షణ, అంతర్ధార్మిక సంభాషణలపై దృష్టి సారించారు. లాటిన్ అమెరికా నుంచి పోప్‌గా ఎంపికై అరుదైన రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు.
కొద్దిరోజుల క్రితమే పోప్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భారత పర్యటనకు ముందు పోప్ ఫ్రాన్సిస్ ఆశీస్సులు తీసుకున్నారు. పోప్ ఫ్రాన్సిస్ రష్యా -ఉక్రెయిన్ యుద్దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. రెండు దేశాలు శాంతిని పాటించాలని పలుమార్లు సందేశాన్ని ఇచ్చారు. గాజాలో కూడా శాంతి నెలకొనాలని పోప్ ఆకాంక్షించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…