
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశం చేసిన దాడి నుండి పాకిస్తాన్ ఇంకా కోలుకోలేదు. ఇంతలో, బలూచిస్తాన్‌లో పరిస్థితులు వేగంగా దిగజారిపోయాయి. బలూచిస్తాన్‌లో ఎక్కువ భాగం ఇప్పుడు పాకిస్తాన్ నియంత్రణ కోల్పోయింది. ఇప్పటికే మీర్ యార్ బలోచ్ సహా ప్రముఖ బలోచ్ నాయకులు బలూచిస్తాన్‌కు స్వాతంత్ర్యం ప్రకటించారు. భారతదేశం తోపాటు ఐక్యరాజ్యసమితి నుండి గుర్తింపు, మద్దతును కోరుతున్నారు. ఇంతలో, బలూచిస్తాన్‌లోని ఎక్కువ భాగంపై పాకిస్తాన్ అధికారుల నియంత్రణ లేదంటూ బలూచ్ అమెరికన్ కాంగ్రెస్ సెక్రటరీ జనరల్ రజాక్ బలూచ్ ఒక పిడుగులాంటి విషయాన్ని వెల్లడించారు.
బెలూచిస్తాన్ TAG TV కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బలూచ్ అమెరికన్ కాంగ్రెస్ సెక్రటరీ జనరల్ రజాక్ బలూచ్, పాకిస్తాన్ దళాలు చీకటి పడ్డాక క్వెట్టాను వదిలి వెళ్ళడానికి కూడా భయపడుతున్నాయని, బంగ్లాదేశ్ వంటి పరిస్థితి కోసం వేచి ఉండకుండా, సకాలంలో గౌరవంగా వెనక్కి తగ్గాలని పేర్కొన్నారు. ‘చీకటి పడ్డాక పాకిస్తాన్ సైన్యం క్వెట్టా నుండి బయటకు కూడా కదలదు’ అని అన్నారు. పాకిస్తాన్ అధికారులు కూడా ఈ పరిస్థితిని అంగీకరించారని, భద్రతా కారణాల దృష్ట్యా, సైన్యం సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 5 గంటల మధ్య రోడ్లను క్లియర్ చేస్తుందని, కనీసం గస్తీ కూడా నిర్వహించదని ఆయన అన్నారు. బలూచిస్తాన్‌లో 70-80 శాతం ప్రాంతం ఇకపై పాకిస్తాన్ నియంత్రణలో లేదని రజాక్ బలూచ్ అన్నారు .
బలూచ్ పోరాటానికి మద్దతు ఇవ్వాలని ప్రపంచ శక్తులను, ముఖ్యంగా భారతదేశం, యునైటెడ్ స్టేట్స్‌ను కోరింది. భారతదేశం మాకు మద్దతు ఇస్తే, బలూచిస్తాన్ తలుపులు భారతదేశానికి తెరుచుకుంటాయని ఆయన విజ్ఞప్తి చేశారు. మద్దతు ఆలస్యం చేయడం వల్ల బలూచిస్తాన్‌ను మాత్రమే కాకుండా మొత్తం ప్రాంతాన్ని ప్రభావితం చేసే అనాగరిక సైన్యం ఆవిర్భావానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. బలూచ్ ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వాలని, స్వయం నిర్ణయాధికారం కోసం వారి పోరాటాన్ని గుర్తించాలని ఆయన ప్రజాస్వామ్య దేశాలకు విజ్ఞప్తి చేశారు.
పాకిస్తాన్ ప్రావిన్సులలో శాంతిని నెలకొల్పాలని, సైనిక అణచివేతను వెంటనే ముగించాలని పిలుపునిస్తూ, బంగ్లాదేశ్ వంటి పరిస్థితిని ఎదుర్కోవడం కంటే పాకిస్తాన్ సైన్యం గౌరవంగా వెనక్కి తగ్గడం తెలివైన పని అని రజాక్ వ్యాఖ్యానించాడు.
ఇటీవలి కాలంలో బలూచిస్తాన్‌లో వేర్పాటువాద ఉద్యమం ఊపందుకుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ యోధులు పాకిస్తాన్ సైన్యం, చైనా ప్రాజెక్టులపై నిరంతరం దాడి చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం, బలూచ్ నాయకుడు మీర్ యార్ బలూచ్ పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. అతను సోషల్ మీడియాలో, బలూచిస్తాన్ పాకిస్తాన్ కాదని రాశాడు. పాకిస్తాన్, చైనాతో ఉద్రిక్తతల మధ్య మీర్ భారతదేశానికి మద్దతుగా తన స్వరాన్ని పెంచారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ, నరేంద్ర మోదీ, మీరు ఒంటరివారు కాదని, మీకు బలూచ్ దేశభక్తుల మద్దతు ఉంది అంటూ ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి మద్దతు పలికారు.
“పాకిస్తాన్ సొంత ప్రజలు పంజాబీలు, వారు వైమానిక బాంబు దాడులను, బలవంతపు అదృశ్యాలను, మారణహోమాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు” అని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో రాయబార కార్యాలయాన్ని అనుమతించడం ద్వారా బలూచిస్తాన్ సార్వభౌమత్వాన్ని గుర్తించాలని మీర్ యార్ బలూచ్ భారతదేశాన్ని కోరారు. శాంతి పరిరక్షక మద్దతు కోసం ఐక్యరాజ్యసమితిని కోరారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..