Watch Video: గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు.. హమాస్ కార్యాలయం కూల్చివేత..

తమ దాడుల్లో ఇజ్రాయెల్‌కు చెందిన 300 మంది మృతి చెందగా.. మరో 1000 మంది వరకు గాయపడినట్లు హమాస్ తీవ్రవాద సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్ సేనలు జరిపిన దాడుల్లో గాజాలో 232 మంది మృతి చెందగా.. దాదాపు 1,700 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

Watch Video: గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు.. హమాస్ కార్యాలయం కూల్చివేత..
Israel Palestine War

Updated on: Oct 08, 2023 | 12:01 PM

ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. పాలస్తీనాకు చెందిన హమాస్ తీవ్రవాదుల మెరుపు దాడులను ఇజ్రాయెల్ సేనలు తిప్పికొడుతున్నాయి. గాజా ప్రాంతంపై ప్రతి దాడులను కూడా ముమ్మరం చేసింది.  ఇరు వర్గాల మధ్య సాగుతున్న దాడి, ప్రతిదాడుల్లో ఇప్పటి వరకు 500 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. ఇజ్రాయెల్‌పై హమాస్ తీవ్రవాదులు వేలాది రాకెట్ల మెరుపు దాడులతో మారణ హోమం సృష్టిస్తున్నారు. అటు పాలస్తీనాపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్‌.. గాజా ప్రాంతంలో బాంబుల వర్షం కురిపిస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధంలో ఇటు ఇజ్రాయెల్, అటు గాజా ప్రాంతాల్లో భారీ సంఖ్యలో అమాయక ప్రజలు బలయ్యారు.

తమ దాడుల్లో ఇజ్రాయెల్‌కు చెందిన 300 మంది మృతి చెందగా.. మరో 1000 మంది వరకు గాయపడినట్లు హమాస్ తీవ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఇజ్రాయెల్ సేనలు జరిపిన దాడుల్లో గాజాలో 232 మంది మృతి చెందగా.. దాదాపు 1,700 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. భీకర దాడుల నేపథ్యంలో గాజా ప్రాంతం నుంచి వేలాది మంది పాలస్తీనియన్లు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. గాజా ప్రాంతంలో మరిన్ని దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించడంతో వారు..కట్టు బట్టలతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

గాజాలో హమాస్ తీవ్రవాదుల కార్యాలయమైన 14 అంతస్థుల భవనాన్ని ఇజ్రాయెల్ వైమానిక సేనలు కూల్చివేశారు. ఈ దాడుల్లో భారీ భవనం పేక మేడలా నిమిషాల వ్యవధిలో కుప్పకూలిపోయింది. అక్కడి నుంచి అమాయక ప్రజలు వెళ్లిపోవాలని ఆ భవనంపై దాడులకు ముందు ఇజ్రాయెల్ 10 నిమిషాల సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.

ఇజ్రాయెల్ దాడుల్లో కుప్పకూలిన హమాస్ కార్యాలయం.. వీడియో

హమాస్ దాడులను బ్లాగ్ డే‌గా అభివర్ణిస్తూ.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ప్రకటించారు. హయాస్‌ను అంతం చేసేందుకు తమ సైనిక సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని ప్రకటించారు. గాజాలోని హమాస్ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని.. సమీపంలోని పాలస్తీనా ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి సూచించారు. ఈ రోజు చాలా కఠినంగా ఉంటుందని.. గాజాలో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ తీవ్రంగా ఉంటుందని స్పష్టంచేశారు. ఇజ్రాయెల్‌లో ఇళ్లలో ఉంటున్న చిన్నారులు, తల్లులను కూడా హమాస్ తీవ్రవాదులు హతమార్చారని ఆరోపించారు.

హమాస్ తీవ్రవాదుల చెరలో పిల్లలు, మహిళలు కూడా భారీ సంఖ్యలో బంధీలుగా ఉన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ భూభాగం నుంచి కొందరు మహిళలను జుట్టు పట్టుకుని హమాస్ తీవ్రవాదులు తమ వెంట గాజాకు లాక్కెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అయితే హమాస్ తీవ్రవాదులపై దాడులతో కొందరు బంధీలకు వారి నుంచి విముక్తి కల్పించినట్లు ఇజ్రాయెల్ సేనలు తెలిపాయి. తమ దాడుల్లో నలుగురు హమాస్ ముష్కరులు హతమైనట్లు ప్రకటించారు.

కాగా ఇజ్రాయెల్‌పై తాము జరిపిన మెరుపుదాడులకు ఇరాన్ మద్దతు ఉన్నట్లు హమాస్ అధికారికంగా ప్రకటించుకుంది. ఆ మేరకు హమాస్ అధికార ప్రతినిధి ఘాజీ హమీద్ ఆ మేరకు ఆంగ్ల మీడియాకు వెల్లడించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని ఆత్మరక్షణ చర్యగా ఇరాన్ అభివర్ణించింది. ఇజ్రాయెల్ చేతిలో అణచివేతకు గురైనా పాలస్తీనా ప్రజలు ఆత్మరక్షణ కోసం ఈ దాడులకు పాల్పడుతున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ శనివారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటలో తెలిపింది.