Kim Jong: మళ్లీ అదృశ్యమైన కిమ్ మామ.. అనారోగ్య సమస్యలంటూ ప్రచారం.. ఎక్కడున్నారు.. ఏమయ్యారు..

|

Feb 07, 2023 | 9:27 PM

ఈయన కనిపించినా వార్తే.. కనిపించకుండా పోయినా వార్తే.. ఆయనే కిమ్. ఆరోగ్యం బాగోలేదా.. లేక ఇంకేమైనా కారణమో తెలీదు గానీ.. 40 రోజులుగా ఆయన ఎక్కడా కిమ్మనడం లేదు. ఇంతకీ కిమ్‌కు ఏమైంది. ? ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు?

Kim Jong: మళ్లీ అదృశ్యమైన కిమ్ మామ.. అనారోగ్య సమస్యలంటూ ప్రచారం.. ఎక్కడున్నారు.. ఏమయ్యారు..
Kim Jong Un
Follow us on

కిమ్ జాంగ్ ఉన్.. ఉత్తర కొరియా అధ్యక్షుడిగా ప్రపంచానికి దాదాపుగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. నిత్యం ఎక్కడో ఒకచోట ఆయుధాలను పరీక్షిస్తూ వార్తల్లో కెక్కుతారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటారు. బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగిస్తూ.. అమెరికా సహా పలు శత్రు దేశాలకు వార్నింగ్ ఇస్తూ.. ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించారు. అయితే అనూహ్యంగా 40 రోజుల నుంచి కిమ్ ఎక్కడా కనిపించలేదు. అధికారిక కార్యక్రమాల్లోనూ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఈ ఆదివారం జరిగిన పొలిట్‌ బ్యూరో సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. సోమవారం మిలటరీ కమిషన్‌ సమావేశంలో.. రాజకీయ, సైనిక అంశాలపై కీలకమైన చర్చ జరిగింది. ఈ సమావేశానికి కిమ్ హాజరైనట్టు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఎలాంటి ఫొటోలు బయటకు రాలేదు. దీంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటివరకూ రెండు సార్లు మాత్రమే పొలిట్‌బ్యూరో సమావేశాలకు కిమ్ హాజరు కాలేదు. ఇప్పుడు మూడోసారి ఆయన లేకుండానే సమావేశాలు నిర్వహించింది పార్టీ.

మరోవైపు దేశ రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో ఈ నెల 8నుంచి కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ 75వ వార్షికోత్సవ పరేడ్‌ జరగనుంది. సైన్యం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ దేశం సొంతంగా తయారు చేసిన క్షిపణులు, అణ్వాయుధాలను ఈ పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. దీని కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికైనా హాజరవుతారా.. లేదా అనే దానిపై క్లారిటీ లేదు.

ఇవి కూడా చదవండి

దేశంలో ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతున్న.. ఇలాంటి కీలక సమయంలో దేశాధినేత సుదీర్ఘకాలం పాటు కనిపించకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. ఏప్రిల్ 2020, మే 2021లోనూ కొన్ని రోజుల పాటు కిమ్ కనిపించకుండా పోయారు. కానీ ఈసారి చాలా రోజులుగా ఆయన జాడ లేదు. 2014 తర్వాత కిమ్‌.. 40 రోజులపాటు కనిపించకుండా పోవడం ఇదే తొలిసారి. గతంలో ఆయన అదృశ్యమైన ప్రతిసారీ ఆరోగ్యం బాగోలేదనే ప్రచారం జరిగింది. ఈ సారి కూడా అదే అంశం తెరపైకి వచ్చింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం