ధ్యానంలో ఉన్నవారిపై యుద్ధ విమానం దాడి.. బాంబుల మోతతో దద్దరిల్లిన ప్రాంతం.. 14 మంది మృతి

మయన్మార్‌లోని ఓ బౌద్ధ మఠంపై సైన్యం జరిపిన వైమానిక దాడిలో 14 మంది మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. కేంద్ర సగైంగ్‌ ప్రాంతం మ్యాంగ్‌ టౌన్‌షిప్‌లోని ఓ గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం 9 గంటల సమయంలో మఠంలో ధ్యాన కార్యక్రమం జరుగుతుండగా జెట్‌ ఫైటర్‌ దాడి చేసింది

ధ్యానంలో ఉన్నవారిపై యుద్ధ విమానం దాడి.. బాంబుల మోతతో దద్దరిల్లిన ప్రాంతం.. 14 మంది మృతి
Myanmar Airstrike On Buddhist Monastery During Lent Kills 14

Updated on: Aug 23, 2026 | 4:17 PM

మయన్మార్‌లోని మిలిటరీ ప్రభుత్వం మరో దారుణానికి తెగబడింది.  ఓ బౌద్ధ మఠంపై జరిపిన వైమానిక దాడిలో 14 మంది మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. కేంద్ర సగైంగ్‌ ప్రాంతంలోని మ్యాంగ్‌ టౌన్‌షిప్‌లోని ఓ గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.  బౌద్ధ మఠంలో వారం రోజుల ధ్యాన కార్యక్రమం జరుగుతోంది. ఉదయం 9 గంటల సమయంలో జెట్‌ ఫైటర్‌తో దాడికి దిగింది మిలిటరీ ప్రభుత్వం. మఠంలో ఆ సమయంలో వంద మందికిపైగా ఉన్నారు.  స్థానికుల కథనం ప్రకారం.. జెట్‌ ఫైటర్‌ దాదాపు 15 నిమిషాల వ్యవధిలో రెండు బాంబులను జారవిడిచింది. మొదటి బాంబు మఠం ప్రాంగణంలో పడగా, రెండోది సమీపంలోని ఓ ఇంటిపై పడింది. దాడి తీవ్రతతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతులకు అక్కడికక్కడే అంత్యక్రియలు నిర్వహించి, ప్రాణభయంతో పలువురు సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు.

పౌరులే లక్ష్యంగా దాడులు?

మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న తిరుగుబాటు వర్గాలను అణచివేసే చర్యల్లో భాగంగా సైన్యం వైమానిక దాడులకు పాల్పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇలాంటి దాడుల్లో సాధారణ ప్రజలు, మహిళలు, చిన్నారులు, బౌద్ధ భిక్షువులే ఎక్కువగా బలవుతున్నారని ప్రతిపక్ష వర్గాలు విమర్శిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఇండిపెండెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ మెకానిజం ఫర్‌ మయన్మార్‌ (IIMM) కూడా సైన్యం పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని ఆరోపించింది. 2025 జూలై నుంచి 2026 జూన్‌ వరకు జరిగిన ఘటనలపై విడుదల చేసిన నివేదికలో ఇళ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, నిరాశ్రయుల శిబిరాలపై వైమానిక దాడులు జరిగినట్లు పేర్కొంది.

ఈ దాడుల్లో చిన్నారులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని IIMM చీఫ్‌ నికోలస్‌ కుమ్‌జియాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధ నిర్బంధాలు, చిత్రహింసలు, లైంగిక హింసకు సంబంధించిన ఆరోపణలపైనా ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ధ్యానం కోసం ఒకచోట చేరిన ప్రజలపై బాంబులు పడటం.. మయన్మార్‌లో కొనసాగుతున్న సైనిక హింస ఎంతటి విషాదకర స్థాయికి చేరిందో మరోసారి ప్రపంచం ముందు ఉంచింది.

Loading...
Unable to load recommendations.
Follow Us