
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) మాజీ ప్రధాన కార్యదర్శి మిర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ ఆ దేశ 23వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గురువారం జాతీయ పార్లమెంట్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు 255 ఓట్లు పోలయ్యాయి. 11 పార్టీల ప్రతిపక్ష కూటమి మద్దతుతో బరిలోకి దిగిన ప్రత్యర్థి ఒలీ అహ్మద్‌కు కేవలం 88 ఓట్లు వచ్చాయి. ఆగస్ట్ 21న ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి.
బంగ్లాదేశ్ ఎన్నికల ప్రధాన కమిషనర్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు. మొత్తం 343 మంది పార్లమెంట్ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తర్వాత ఎన్నికల ప్రధాన కమిషనర్ మిర్జా ఫఖ్రుల్ ను విజేతగా ఎనౌన్స్ చేసారు. బంగ్లాదేశ్ జాతీయ పార్లమెంట్‌లో మొత్తం 350 స్థానాలు ఉన్నాయి. ఒక నియోజకవర్గంలో ఎన్నిక నిలిచిపోవడంతో 349 మంది సభ్యులకి మాత్రమే ఓటు వేసే అవకాశం వచ్చింది. వారిలో 343 మంది అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు.
ఈసారి బంగ్లాదేశ్ అధ్యక్ష ఎన్నికలు విశేషతను సంతరించుకున్నాయి. దాదాపు 35 ఏళ్ల తర్వాత తొలిసారి ఒకరికి మించి మరొకరు అధ్యక్ష పదవికి పోటీ చేశారు. గతంలో ప్రతిపక్షాలు అభ్యర్థులను బరిలోకి దింపేవి కావు. దాంతో అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవంగా లేదా ఒకే అభ్యర్థితో జరిగేవి. అయితే ఈసారి బీఎన్‌పీ అభ్యర్థిగా మిర్జా ఫఖ్రుల్ బరిలో నిలవగా, జమాతే ఇస్లామీ నేతృత్వంలోని 11 పార్టీల ప్రతిపక్ష కూటమి, నేషనల్ సిటిజన్ పార్టీ మద్దతుతో ఒలీ అహ్మద్ పోటీ చేశారు. దాంతో ఎన్నికపై రాజకీయ వర్గాల్లో జోష్ నెలకొంది.
మాజీ ప్రధాని షేక్ హసీనాకు సన్నిహితుడిగా పేరున్న మాజీ అధ్యక్షుడు మహ్మద్ షహాబుద్దీన్ జూలై 24న తన పదవికి రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. ఐదేళ్ల పదవీకాలం పూర్తవ్వకముందే ఆయన రాజీనామా చేశారు. అనారోగ్య సమస్యలు, సుదీర్ఘకాలం వైద్య చికిత్స అవసరం కావడంతో తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు షహాబుద్దీన్ తెలిపారు. ఆయన రాజీనామా తర్వాత బంగ్లాదేశ్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం పార్లమెంట్ స్పీకర్ హఫీజుద్దీన్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికలతో ఆ తాత్కాలిక వ్యవస్థకు ముగింపు పలికినట్లైంది. మిర్జా ఫఖ్రుల్ దేశ 23వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.