
శత్రుదేశం పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రదాడులు కలకలం రేపాయి. ఆఫ్ఘన్ సరిహద్దు సమీపంలో పాకిస్తాన్ పారామిలిటరీపై ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో ఇద్దరు అధికారులు సహా దళాలకు చెందిన 11 మంది సభ్యులు మరణించారు. ఈ దాడికి బాధ్యత వహిహిస్తూ పాకిస్తాన్ తాలిబన్ (TTP) ఒక ప్రకటన విడుదల చేసింది. కుర్రం వాయువ్య జిల్లాలో రోడ్డు పక్కన బాంబులు అమర్చి, ఆ తర్వాత కాన్వాయ్ పై కాల్పులు జరిపారని పాకిస్తాన్ భద్రతా అధికారులు తెలిపారు.
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఒరాక్జాయ్ జిల్లాలో మంగళవారం రాత్రి భద్రతా దళాలు నిఘా ఆధారిత ఆపరేషన్ నిర్వహించాయని సైనిక మీడియా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఆపరేషన్ సమయంలో, దళాల జరిపిన దాడిలో 19 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. కానీ ఈ ఎదురుకాల్పుల్లో పాక్ లెఫ్టినెంట్ కల్నల్ జునైద్ ఆరిఫ్ (39), సెకండ్ ఇన్ కమాండ్ మేజర్ తయ్యబ్ రహత్ (33) సహా మరో తొమ్మిది మంది మరణించినట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా TTP ఇటీవల పాకిస్తాన్ భద్రతా దళాలపై దాడులను ముమ్మరం చేసింది.గత మూడు నెలల్లో పాకిస్తాన్‌లో 329 ఉగ్రవాద దాడులు జరగగా కనీసం 901 మంది మరణించారు. మరో 599 మంది గాయపడ్డారని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (CRSS) నివేదిక తెలిపింది.గత త్రైమాసికంతో పోలిస్తే ఈ సంఖ్య 46% పెరిగినట్టు తెలుస్తోంది. గత సంవత్సరంలో మొత్తం 2,546 మరణాలు సంభవిస్తే ఈఏడాది ఇప్పటికే 2,414 మరణాలు నమోదయ్యాయి. ఏడాది పూర్తయ్యేలోపు ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.