Mexico Truck Crash: మెక్సికో దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 49 మంది వలస కూలీలు దుర్మరణం చెందారు. మెక్సికోలోని దక్షిణాది రాష్ట్రమైన చియాపాస్‌లో వలసదారులతో వెళ్తున్న ట్రక్కు గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 49 మంది వలసదారులు మృతి చెందారని అధికారులు తెలిపారు. మరో 40 మంది గాయపడ్డారని.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. గ్వాటెమాలా సరిహద్దు రాష్ట్రమైన చియాపాస్‌లో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. అతివేగంగా ఉన్న వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు.
కాగా.. మరణించిన వారంతా వలస కార్మికులని అధికారులు నిర్ధారించారు. సరైన ధృవపత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాకు వెళ్తున్నారని స్థానిక ప్రాసిక్యూటర్ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమన్నారు. కూలీలు ప్రయాణిస్తున్న ట్రక్కు దురద్రుష్టవశాత్తు అదుపుతప్పి చియాపాస్‌లో రిటైనింగ్ గోడను బలంగా ఢీకొని బోల్తా పడిందని వెల్లడించారు. వారంతా ఏదేశానికి చెందినవారనే విషయం ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.
కాగా.. మృతుల కుటుంబాలకు రాష్ట్ర గవర్నర్ రుటిలియో ఎస్కాండన్ సంతాపం వ్యక్తంచేవారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణం ఎవరనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Also Read: