చర్చిలో భారీ పేలుడు.. 10 మంది మృతి!

మెక్సికోలో మతపరమైన వేడుకల సందర్భంగా ఘోర ప్రమాదం జరిగింది. పటాకుల సామగ్రి భారీగా పేలడంతో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 64 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి చర్చి సమీపంలోని గోడ కూలిపోయింది. గాయపడిన వారిలో చిన్నారులు, వృద్ధులు ఉన్నట్లు సమాచారం. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

చర్చిలో భారీ పేలుడు.. 10 మంది మృతి!
Mexico Fireworks Explosion

Updated on: Sep 07, 2026 | 8:53 AM

మెక్సికోలోని టెమాస్కాల్సింగో మున్సిపాలిటీలో జరిగిన మతపరమైన వేడుకల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి శాంటా మారియా కాన్చెస్డా ప్రాంతంలోని న్యూస్ట్రా సెనోరా డి లా లూజ్ చర్చి సమీపంలో పటాకుల సామగ్రి పేలడంతో కనీసం 10 మంది మృతి చెందగా, మరో 64 మంది గాయపడ్డారు. వర్జిన్ ఆఫ్ ది లైట్‌ గౌరవార్థం నిర్వహిస్తున్న మతపరమైన ఉత్సవాలకు వందలాది మంది హాజరయ్యారు. పటాకుల ప్రదర్శనకు సిద్ధమవుతున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి చర్చి సమీపంలోని గోడ కూలిపోవడంతో పరిస్థితి మరింత విషమించింది.

ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, సివిల్‌ ప్రొటెక్షన్‌ బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాయి. గాయపడిన వారిలో చిన్నారులు, వృద్ధులు కూడా ఉన్నట్లు సమాచారం. స్థానిక బిషప్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు పూజారులు కూడా గాయపడ్డారు. పేలుడుకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. మెక్సికో స్టేట్‌ అటార్నీ జనరల్‌ కార్యాలయం ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. మృతుల సంఖ్య మరింత పెరుగుతుందా అనే విషయంపై అధికారులు ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us