
మెటా కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కొత్త ఇల్లు కొన్నారు. ఐర్లాండ్‌లోని పురాతనమైన భవంతిని కళ్లు చెదిరే ధరకు ఈ సాంకేతిక దిగ్గజం సొంతం చేసుకున్నారు. 19వ శతాబ్ధం నాటి ఈ బంగళాను జుకర్‌బర్గ్ , ప్రిసిల్లా దంపతులు 30 మిలియన్ యూరోలు అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 335 కోట్లు వెచ్చించి కొన్నట్టు సమాచారం. ‘స్ట్రాన్‌కల్లి క్యాసిల్’గా పిలిచే ఈ భవంతి ఏకంగా 440 ఎకరాల సువిశాలమైన ఎస్టేట్‌లో విస్తరించి ఉంది.
సోషల్ మీడియా సంస్థలతో కోట్లు ఆర్జిస్తున్న మార్క్ జుకర్‌బర్గ్ తన రేంజ్‌కు తగ్గట్టే ఈ లగ్జరీ భవంతిని దక్కించుకున్నారు. జుకర్‌బర్గ్ ఎక్కువగా అమెరికాలోనే ఉంటారు. కానీ, ఐర్లాండ్‌లో మెటా ఆఫీస్ ఉంది కాబట్టి, ఆయన ఆ దేశానికి వెళ్లినప్పుడు ఆ కోటలోనే ఉండాలని అనుకుంటున్నారు. డబ్లిన్‌లోని మెటా కార్యాలయానికి సమీపంలోనే ఈ భవనం ఉంది. మెటా అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం అదే కావడంతో, ఐర్లాండ్‌కు వెళ్లినప్పుడు గడపడానికి జుకర్‌బర్గ్ కుటుంబం దీనిని ఎంచుకుంది.
ఈ కోటను 200 ఏళ్ల క్రితం జాన్ కైలీ అనే వ్యక్తి కట్టించారు. ఆ తర్వాత మైఖేల్, గియాంకార్లా అనే దంపతులు దీనిని కొనుగోలు చేసారు. కోటలో 3 అంతస్తులు, 11 పడక గదులు ఉన్నాయి. ఇది ఐర్లాండ్ వాటర్‌ఫోర్డ్ కౌంటీలోని ఒక నది ఒడ్డున ఉంది. చుట్టూ దట్టమైన చెట్లు, పచ్చని గడ్డి మైదానాలతో చూడటానికి ఇదొక అందమైన అడవిలా ఉంటుంది.
పైకి ఇదొక అద్భుతమైన కథల పుస్తకంలా కనిపించినా, దీని వెనుక ఒక చీకటి రహస్యం ఉంది. చాలా కాలం క్రితం ఈ కోట ఉన్న ప్రాంతంలో “మర్డర్ హోల్” (హత్యల బావి) అనే భయానకమైన పద్ధతి ఉండేదని, ఇక్కడకు వచ్చే శత్రువులను లేదా అమాయకులను ఆ బావిలో పడేసి చంపేవారనే ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది. నది నీటి ప్రవాహం శబ్దాల వల్ల వారి అరుపులు బయటికి వినిపించేవి కాదట!
ఇదంతా నిజమైన హత్యల రహస్యమా లేక కేవలం ఒక పుకారా అనేది స్పష్టంగా తెలియకపోయినా రూ. 335 కోట్ల ఈ అద్భుతమైన కోట వెనుక ఇటువంటి భయానక గతం ఉండటం మాత్రం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది!