Earthquake: 3లక్షల మందికి ఒకేసారి మరణ గండం.. గజ గజ వణికిపోతున్న ఆ దేశంలోని జనం..

ఎర్త్‌ క్వేక్‌.. అంటే భూకంపం గురించి మనం విన్నాం. మొన్ననే మయన్మార్‌లో చూశాం. కానీ మెగా క్వేక్‌ గురించి విన్నారా? రాబోయే కాలంలో జపాన్‌లో చూడొచ్చంటున్నారు సైంటిస్టులు. సీస్మోగ్రాఫ్‌పై 7.7 మాగ్నిట్యూడ్‌ తీవ్రతతో వచ్చిన భూకంపంతో మయన్మార్‌ నేలమట్టమై పోయింది. పొరుగునే ఉన్న థాయ్‌లాండ్‌ కూడా కుదేలైపోయింది.

Earthquake: 3లక్షల మందికి ఒకేసారి మరణ గండం.. గజ గజ వణికిపోతున్న ఆ దేశంలోని జనం..
Japan Earthquake

Updated on: Apr 02, 2025 | 8:12 PM

ఎర్త్‌ క్వేక్‌.. అంటే భూకంపం గురించి మనం విన్నాం. మొన్ననే మయన్మార్‌లో చూశాం. కానీ మెగా క్వేక్‌ గురించి విన్నారా? రాబోయే కాలంలో జపాన్‌లో చూడొచ్చంటున్నారు సైంటిస్టులు. సీస్మోగ్రాఫ్‌పై 7.7 మాగ్నిట్యూడ్‌ తీవ్రతతో వచ్చిన భూకంపంతో మయన్మార్‌ నేలమట్టమై పోయింది. పొరుగునే ఉన్న థాయ్‌లాండ్‌ కూడా కుదేలైపోయింది. ఇక అదే భూకంపం… 9 పాయింట్లు దాటి వస్తే దాన్నే మెగా క్వేక్‌ అంటారు. ఆ స్థాయి భూకంపం వస్తే, ఆ తర్వాత సునామీ కూడా విరుచుకుపడుతుంది. ఇప్పుడు ఇదే మెగా క్వేక్‌ భయం జపాన్‌ను వెంటాడుతోంది. రాబోయే 30 ఏళ్లలో ఎప్పుడో అప్పుడు కాళ్ల కింద భూమి బద్దలైపోతుంది.. నెత్తి మీద కప్పు కూలిపోతుందని, బతుకు చితికిపోతుందని తెలుసు. దానిని ఎలా ఎదుర్కోవాలా అనేదే జపాన్‌కు అతి పెద్ద సమస్యగా మారింది.

ఆ మెగా క్వేక్‌తో జపాన్‌లో 3 లక్షలమంది మరణిస్తారని అంచనా వేస్తున్నారు. 12లక్షలమందికి పైగా నిలువనీడ లేకుండా పోతారని చెబుతున్నారు. 2 లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుందట. అంటే మన కరెన్సీలో సుమారుగా 170 లక్షల కోట్ల రూపాయలు. ఇక చలికాలం పూట, రాత్రి వేళ భూమి బద్దలవుతుందని, ఆ తర్వాత సునామీ పడగ విప్పి విరుచుకుపడుతుందని అంచనాలు కడుతున్నారు. 2024లో దక్షిణ జపాన్‌లో వచ్చిన భూకంపం తర్వాత, ఈ మెగా క్వేక్‌ అంచనాలు వెలువడ్డాయి. నాంకై ట్రఫ్‌ కేంద్రంగా ఈ మెగా క్వేక్‌ వస్తుందని భావిస్తున్నారు. టోక్యో నుంచి క్యుషు ద్వీపం దాకా.. సముద్రం లోపల 900 కిలోమీటర్ల పొడవుండే గోతినే నాంకాయ్‌ ట్రఫ్‌ అంటారు. ఇక్కడే యూరేషియన్‌ టెక్టానిక్‌ ప్లేట్‌ కిందకు ఫిలిప్పీన్స్‌ సీ ప్లేట్‌ చొచ్చుకు వెళుతోంది. దీంతో అవి ఒకదానినొకటి ఢీకొన్నప్పుడు, సీస్మోగ్రాఫ్‌పై 9 పాయింట్లను మించి మహా భూకంపం లేదా మెగా క్వేక్‌ పుడుతుంది. రాబోయే 30 ఏళ్లలో, ఏ క్షణంలోనైనా ఇది సంభవించవచ్చని సమాచారం. ఆ యూరేషియన్‌ ప్లేట్‌ మీదే జపాన్‌ ఉండడం..వాళ్లకు దినదినగండంగా మారింది.

100 నుంచి 200 ఏళ్లకు ఒకసారి మహా భూకంపాలు వస్తాయని చరిత్రచెబుతోంది. అలాంటి మెగా క్వేక్‌ 1946లో వచ్చింది. ఇప్పుడు నాంకై ట్రఫ్‌లో టెక్టానిక్‌ ప్లేట్లు కదులుతున్నాయి. దీంతో మెగా క్వేక్‌ ముప్పు తీవ్రత మరింత పెరిగింది. అలాంటి భూకంపం వస్తే…నిమిషాల్లో 34 మీటర్ల ఎత్తుతో సునామీ విరుచుకుపడి, తీర ప్రాంతాలను తుడిచి పెట్టేస్తుంది. మెగా క్వేక్‌ వస్తే, ఆ తర్వాత వారంలోనే సీస్మోగ్రాఫ్‌పై 7 పాయింట్ల మాగ్నిట్యూడ్‌ని దాటి మరో భూకంపం కూడా వస్తుందట. దీన్ని ఎలా ఎదుర్కోవాలా, నష్ట తీవ్రతను ఎలా తగ్గించాలా అని జపానీయులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..