
గాజాలో ట్రంప్ శాంతిమంత్రం సక్సెస్ అవుతుందా..? ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల రాజీ ఫార్మూలా వర్కౌట్ అవుతుందా..? ఈ విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందంపై హమాస్ నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. టర్కీలో ఈ వ్యవహారంపై కీలక చర్చలు జరుగుతున్నాయి. ట్రంప్ ప్రతిపాదనలపై హమాస్ నేతలను ఒప్పించేందుకు ఖతార్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడం మినహా ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాలకు ఓకే చెప్పారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ.
అయితే ఓవైపు ట్రంప్ శాంతిమంత్రం జపిస్తుంటే గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. ఇజ్రాయెల్ తాజా దాడుల్లో 37 మంది చనిపోయినట్టు తెలుస్తోంది.
కాగా.. తన 20 సూత్రాల పీస్ ప్లాన్‌కు హమాస్ ఒప్పుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఇజ్రాయెల్‌కు ఈవిషయంలో సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. మూడు నాలుగు రోజులు మాత్రమే సమయమిస్తున్నామని.. దీనికి అంగీకరించకపోతే.. హమాస్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.
ట్రంప్ 20 సూత్రాల రాజీ ఫార్మూలా కీలక అంశాలు ఉన్నాయి. గాజాలో వెంటనే కాల్పుల విరమణ, హమాస్ దగ్గర బందీలుగా ఉన్న 20 మంది ఇజ్రాయెల్ పౌరుల విడుదల, పాలస్తీనా ఖైదీను ఇజ్రాయెల్ విడుదల చేయడం, హమాస్ ఆయుధాలను విడిచిపెట్టి, గాజాకు దూరం కావడం, ఇరుపక్షాల మధ్య రాజీ తరువాత గాజాకు సాయం పంపించడం, రాజకీయ నేతల ప్రమేయం లేని శాంతి కమిటీని ఏర్పాటు చేయడం , పాలస్తీనా ప్రత్యేక దేశంగా గుర్తించడానికి ప్రయత్నాలు ఈ ప్రతిపాదనల్లో ఉన్నాయి.
ట్రంప్ శాంతి ప్రతిపాదనలను ప్రపంచదేశాలు స్వాగతిస్తున్నాయి. భారత ప్రధాని మోదీ కూడా ఈ ప్రతిపాదనలను స్వాగతించారు. డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న కృషిని కొనియాడారు. పాలస్తీనా-ఇజ్రాయెల్ ప్రజలకు ఈ డీల్‌తో ఎంతో మేలు జరుగుతుందన్నారు. గాజా యుద్ధం ముగించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలపై ముస్లిం దేశాలు హర్షం వ్యక్తంచేశాయి. ఖతార్, జోర్డాన్, యూఏఈ, ఇండోనేసియా, పాకిస్థాన్, ఈజిప్టు, తుర్కియే, సౌదీ అరేబియా దేశాలు ఈమేరకు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ట ఫ్రాన్స్ ప్రధాని ఇమాన్యుయేల్ మెక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా ట్రంప్ ప్రణాళికకు మద్దతు తెలిపారు.
గాజా యుద్ధం ఆపేందుకు ట్రంప్ సూచించిన శాంతి ఫార్ములాకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించారు. ట్రంప్‌తో భేటీ తరువాత నెతన్యాహు ఈవిషయాన్ని ప్రకటించారు. హమాస్ కూడా ఈ ప్రణాళికను అంగీకరించాలని, లేకుంటే ఆ సంస్థను అంతం చేస్తామని నెతన్యాహు హెచ్చరించారు. హమాస్ కూడా తమవద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను వదిలేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.
ట్రంప్ సూచించిన ఫార్మూలాను హమాస్ నేతలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. హమాస్ నేతలు రియాక్షన్ పైనే గాజా భవితవ్యం ఆధారపడి ఉంటుంది. స్థానికులు మాత్రం ఈ యుద్దం కారణంగా ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. ఆకలిమంటలతో గాజా తల్లడిల్లిపోతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..