
అమెరికాలో మెట్రో రైలు నెట్‌వర్క్ సుమారు 1,386 కిలోమీటర్లుగా ఉంది. భారత్ ప్రస్తుతం అమెరికా కంటే కేవలం 216 కిలోమీటర్ల దూరంలో మాత్రమే వెనుకబడి ఉంది. సుమారు 8,000 కిలోమీటర్ల మెట్రో మార్గంతో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో కొనసాగుతోంది.
2014 నాటికి దేశంలో కేవలం 5 నగరాలకే పరిమితమై, 245 కిలోమీటర్లు మాత్రమే ఉన్న మెట్రో నెట్‌వర్క్.. గత దశాబ్ద కాలంలో దాదాపు ఐదు రెట్లు వృద్ధి చెందింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో మరో 1,000 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే రాబోయే రెండేళ్లలో అమెరికాను దాటి భారత్ రెండో స్థానాన్ని దక్కించుకోవడం ఖాయమని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం దేశంలో మెట్రో నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోందని, త్వరలోనే అమెరికాను వెనక్కినెట్టి ప్రపంచంలో రెండో స్థానానికి చేరతామని అన్నారు. గతంలో కొన్ని నగరాలకే పరిమితమైన మెట్రో సేవలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 26 నగరాలకు విస్తరించినట్లు మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చిన నాటికి కేవలం 5 నగరాల్లో మాత్రమే 245 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాలు ఉండేవి. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త మార్గాలు అందుబాటులోకి రానుండటంతో, దేశంలో మెట్రో నెట్‌వర్క్ మరింత వేగంగా వృద్ధి చెందనుందని అన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 26 నగరాల్లో సుమారు 1,170 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. కేవలం 12 ఏళ్ల వ్యవధిలోనే దేశ మెట్రో నెట్‌వర్క్ దాదాపు ఐదు రెట్లు పెరిగిందని మంత్రి తెలిపారు. మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేయడంతో, కొత్త నగరాల్లో కూడా మెట్రో రైలు ప్రాజెక్టుల పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయనీ అన్నారు.
ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్ కలిగిన దేశంగా ఉంది. చైనా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అమెరికా రెండో స్థానంలో ఉంది. “రాబోయే రెండేళ్లలో అమెరికాను అధిగమించి, చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్ కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుందని భావిస్తున్నాను” అని మనోహర్ లాల్ ఖట్టర్ ఆశాభావం వ్యక్తం చేసారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చూడండి