దుబాయ్‌లో క్షిపణి దాడి కలకలం.. కాసేపటికే UAE నుంచి ఊహించని ప్రకటన

మధ్యప్రాచ్యంలోని తాజా భద్రతా పరిణామాల మధ్య ఒక అనూహ్య హెచ్చరిక దుబాయ్‌లో కలకలం రేపింది. కొద్దిసేపటికే పరిస్థితిపై అధికారిక ప్రకటన రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ పరిణామం ప్రాంతీయ ఉద్రిక్తతలు, దౌత్య చర్చలు, భద్రతా వ్యవస్థలపై మరోసారి దృష్టిని కేంద్రీకరించింది.

దుబాయ్‌లో క్షిపణి దాడి కలకలం.. కాసేపటికే UAE నుంచి ఊహించని ప్రకటన
Dubai

Updated on: Jun 26, 2026 | 7:15 PM

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ నగరంలో శుక్రవారం సాయంత్రం క్షిపణి దాడి హెచ్చరిక కలకలం రేపింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:15 గంటల సమయంలో అధికార యంత్రాంగం ప్రజల మొబైల్ ఫోన్లకు అత్యవసర హెచ్చరిక సందేశాలు పంపడంతో నగరవాసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఈ హెచ్చరిక తీవ్ర ఆందోళనకు దారితీసింది. అయితే ఈ హెచ్చరిక ఎందుకు జారీ చేశారనే విషయంపై యూఏఈ అధికారులు వెంటనే ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కొద్దిసేపటికే మరోసారి అధికారిక సమాచారం విడుదల చేస్తూ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని ప్రకటించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఇరాన్‌తో జరిగిన యుద్ధం తర్వాత అమల్లో ఉన్న కాల్పుల విరమణ నేపథ్యంలో ఇలాంటి హెచ్చరిక రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. యుద్ధం ముగిసిన తర్వాత వారాల్లో మొదటిసారి అత్యవసర హెచ్చరిక వ్యవస్థ పనిచేయడంతో దుబాయ్‌లోని స్థానికులు, విదేశీయులు కొంతసేపు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా, హోర్ముజ్ జలసంధిపై తన ప్రభావాన్ని కొనసాగించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్న సమయంలో గురువారం ఒమన్ తీరానికి సమీపంలో ఓ చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌కు చెందిన డ్రోన్ దాడి జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది.

హెచ్చరిక వెలువడిన కొద్దిసేపటికే యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి మధ్య టెలిఫోన్‌లో కీలక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర ఒప్పందాన్ని పూర్తిగా గౌరవించడం ఎంతో ముఖ్యమని యూఏఈ స్పష్టం చేసినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రాంతీయ, అంతర్జాతీయ సంక్షోభాలకు పరిష్కారం యుద్ధం కాదని, బాధ్యతాయుతమైన సంభాషణలు, దౌత్యపరమైన చర్చల ద్వారానే శాశ్వత శాంతి సాధ్యమవుతుందని యూఏఈ మరోసారి నొక్కిచెప్పింది. దుబాయ్‌లో హెచ్చరిక వెనుక అసలు కారణం ఏమిటన్న దానిపై అధికారులు ఇంకా స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు. అయితే భద్రతా వ్యవస్థలు అప్రమత్తంగా ఉన్నాయని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు యూఏఈ ప్రభుత్వం తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us