America: ఫిలడెల్ఫియా అంతర్జాతీయ విమానాశ్రయంలో పారేసిన ఓ కాఫీ కప్పు.. 45 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసు చేధనలో పోలీసులకు సహకరించింది. నిందితుడు పట్టుబడేలా చేసింది. డిసెంబరు, 1975లో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడిని అతను వాడి పడేసిన కాఫీ కప్పు ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డేవిడ్ సినోపోలి(68)ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు.
పెన్సిల్వేనియా అధికారుల ప్రకారం.. 19 ఏళ్ల లిండీ స్యూ బీచ్లర్ డిసెంబరు 1975లో లాంకాస్టర్ కౌంటీలోని ఆమె అపార్ట్‌మెంట్‌లో దారుణ హత్యకు గురైంది. అయితే, ఈ కేసు చేధనలో పోలీసులు ప్రతీసారి విఫలమవుతూనే వచ్చారు. క్లూస్ టీమ్, డీఎన్ఏ పరిశోధకులు సైతం ఎంత పరిశోధించినా పలితం లేకుండా పోయింది. అయితే, తాజాగా వర్జీనియాకు చెందిన DNA విశ్లేషణ సంస్థ పరిశోధకులు.. సినోపోలీని అనుమానితుడిగా గుర్తించింది. ఈ కేసులు ఇన్నాళ్లకు పరిష్కారమైంది.
ఈ మర్డర్ కేసును విచారిస్తున్న డిటెక్టివ్‌లు ఈ ఏడాది ఫిబ్రవరిలో సినోపోలిని ఫిలడెల్ఫియా అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ A వద్ద గుర్తించారు. అతను తాగిన కాఫీ కప్పును చెత్తకుండీలో పడవేసే వరకు వేచి ఉన్నారు. అలా అతను కప్ పడేయగానే.. డిటెక్టివ్‌లు తీసుకున్నారు. ఆ తరువాత DNA విశ్లేషణ జరుపగా.. హత్యకు గురైన బీచ్లర్ లోదుస్తులపై ఉన్న డీఎన్ఏ అతని డీఎన్ఏ ఒక్కటేనని తేల్చారు. సినోపోలి వేలిముద్రలు, DNA మ్యాచ్ అవడంతో.. ఈ హత్య కేసులో నిందితుడు సినోపోలీనే అని తేల్చారు.
వీటి ఆధారంగా సినోపోలీని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లాంకాస్టర్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ హీథర్ ఆడమ్స్ మాట్లాడుతూ..బీచ్లర్ హంతకుడు దక్షిణ కాలాబ్రియా ప్రాంతంలోని ఇటాలియన్ పట్టణం గ్యాస్పెరినాలో ఉంటున్నాడని, పారాబన్ నానోల్యాబ్స్ DNA ఆధారంగా అతనే నిందితుడు అని తేల్చింది. కాగా, బీచ్లర్, సినోపోలి ఒకే అపార్ట్‌మెంట్ బ్లాక్‌లో నివసించినట్లు విచారణలో తేలింది. మొత్తానికి ఏళ్ల తరబడిన నిందితుడిని కనిపెట్టలేకపోయిన అధికారులకు.. ఓ చిన్న కాఫీ కప్ భారీ సహాయం చేసిందనే చెప్పాలి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..