హాంకాంగ్ లో జన సముద్రం… పోలీసులతో ఘర్షణలు.. అంతా ఉద్రిక్తం !

|

Jun 13, 2019 | 12:03 PM

హాంకాంగ్ లో లక్షలాది జనం వీధుల్లో పోటెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బుధవారం పార్లమెంటు ముట్టడికి యత్నించారు. వివాదాస్పదమైన నేరస్థుల అప్పగింత బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ.. ప్రదర్శనలకు దిగారు. నల్లని దుస్తులు ధరించిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించారు. బ్యారికేడ్లను విరగగొట్టుకుని ముందుకు చొచ్చుకు వస్తున్న వీరిపై వారు లాఠీ ఛార్జి చేశారు. అయినా ఆందోళనకారులు తగ్గలేదు. పోలీసులపైనే రాళ్ళ వర్షం కురిపిస్తూ తిరగబడడంతో.. వారిపై పోలీసులు రబ్బర్ బులెట్లను, వాటర్ క్యానన్లను, […]

హాంకాంగ్ లో జన సముద్రం... పోలీసులతో ఘర్షణలు.. అంతా ఉద్రిక్తం !
Follow us on

హాంకాంగ్ లో లక్షలాది జనం వీధుల్లో పోటెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బుధవారం పార్లమెంటు ముట్టడికి యత్నించారు. వివాదాస్పదమైన నేరస్థుల అప్పగింత బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ.. ప్రదర్శనలకు దిగారు. నల్లని దుస్తులు ధరించిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించారు. బ్యారికేడ్లను విరగగొట్టుకుని ముందుకు చొచ్చుకు వస్తున్న వీరిపై వారు లాఠీ ఛార్జి చేశారు. అయినా ఆందోళనకారులు తగ్గలేదు. పోలీసులపైనే రాళ్ళ వర్షం కురిపిస్తూ తిరగబడడంతో.. వారిపై పోలీసులు రబ్బర్ బులెట్లను, వాటర్ క్యానన్లను, పెప్పర్ స్ప్రే తో బాటు బాష్ప వాయువును ప్రయోగించారు.

ఈ పరిణామాలతో పార్లమెంటు సమీపంలోని వీధుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో గురువారం ఉదయం అధికారులు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. ఈ వారాంతం వరకు వీటిని మూసి ఉంచుతామని వారు ప్రకటించారు. హాంకాంగ్ ను బ్రిటన్ చైనాకు అప్పగించిన అనంతరం ఈ నగరంలో ఇంత ఘర్షణ, యుధ్ధ వాతావరణం నెలకొనడం ఇదే మొదటిసారి. ఘర్షణల్లో గాయపడిన వందలాది మందిని ఆసుపత్రులకు తరలించారు. మాస్కులు ధరించిన వేలాది పోలీసులు..లక్షలాది నిరసనకారులను అడ్డుకోలేకపోయారు. దీంతో నిరాయుధులైనవారిని కూడా వారు వదలకుండా వెంటబడి మరీ లాఠీలకు పని చెప్పారు. హాంకాంగ్ లోని నేరస్థులను, అవినీతిపరులను చైనాకు అప్పగించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆందోళనకారులు కోరుతున్నారు. ఈ బిల్లుపై పునరాలోచన చేస్తామని అధికారులు ప్రకటించినా వీరు శాంతించడం లేదు. ఈ నెల 10 న సుమారు 10 లక్షల మంది శాంతియుతంగా ప్రదర్శన జరిపినప్పటికీ.. బుధవారం నాటికి ఇది హింసాత్మకంగా మారింది. హాంకాంగ్ లో చిన్నా, చితకా వ్యాపారవర్గాలు వేలాదిగా ఉన్నాయి. కేవలం చిన్న నేరానికి పాల్పడినంత మాత్రాన నేరస్తుడిని చైనాకు అప్పగించాలన్న ప్రతిపాదనలోని ఔచిత్యాన్ని వీరు ప్రశ్నిస్తున్నారు. తమ వ్యాపార కార్యకలాపాలను ఈ బిల్లు దెబ్బ తీసేదిగా ఉందని అంటున్నారు. హాంకాంగ్ కి గల పాక్షిక స్వయం ప్రతిపత్తిపై చైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని భావిస్తోందని వీరు ముక్త కంఠంతో దుయ్యబడుతున్నారు.