Gas prices in Europe soar 30%: గ్యాస్ సరఫరా చేసే పైప్‌లైన్‌ను రష్యా మూసివేయడంతో యూరప్‌లో వంట గ్యాస్ ధర అమాంతం ఆకాశానికి పాకింది. సెప్టెంబర్ 5 ఉదయం యూరప్ ట్రేడింగ్‌లో గ్యాస్ ధరలు దాదాపు 30 శాతం పెరిగాయి. జర్మనీకి గ్యాస్ సరఫరా చేసే పైప్‌లైన్‌ను 3 రోజులపాటు మూసివేసి సెప్టెంబర్ 3న తెరచినప్పటికీ.. సదరు పైప్‌లైన్‌లో లీకు ఉందని గ్యాజ్‌ప్రోమ్ సంస్థ మరోమారు మూసివేసింది. ఉక్రెయిన్ వివాదం కారణంగా యూరోపియన్ దేశాలను బ్లాక్ మెయిల్ చేసేందుకు రష్యా గ్యాస్ సరఫరాను నిలిపివేస్తోందని, అందుకే రష్యా కావాలనే బ్లాక్‌మెయిల్ చేస్తోందని యూరప్ ఆరోపించింది. ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న దేశాలపై రష్యా ఇంధన సరఫరాలను ఆర్థిక ఆయుధంగా ఉపయోగిస్తోందని యూరోపియన్ మంత్రులు సైతం ఆరోపించారు. రష్యా గ్యాస్‌పై యూరప్ ఆధారపడటం దీనంతటికీ కారణమని తెలుస్తోంది. మరోవైపు రష్యా ఈ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. వాస్తవానికి హోల్‌సేల్ గ్యాస్ ధరలు గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జర్మనీలో గ్యాస్ నిల్వలు నిండుకోవడంతో తొలుత ధరలు పతనం అయ్యాయి. యూరప్‌కు గ్యాస్ సరఫరా తగ్గించాలని క్రెమ్లిన్ నిర్ణయించడంతో హోల్‌సేల్ గ్యాస్‌ధరలు అమాంతం పెరిగాయి. దీంతో యూకేలోనే ఈ పెరుగుదల 35 శాతానికి చేరుకుంది. మరోవైపు శీతాకాలం దగ్గరకొచ్చే కొద్దీ రష్యా చమురును ఆయుధంగా వాడి పశ్చిమ దేశాలపై ప్రతీకారం తీర్చుకోవాలని యోచిస్తోంది. బయటకు మాత్రం నార్డ్‌స్ట్రీమ్ 1 పైప్ లైన్‌లోని లీకులే దీనికి కారణమని చెబుతోంది. ఐతే జర్మనీకి చెందిన సీమన్స్ సంస్థ దీనిని కొట్టిపారేసింది. లీకులు పైప్‌లైన్ పనితీరుపై ఎటువంటి ప్రభావం చూపవని చెప్పింది. మరోవైపు యూరప్ దేశాలు పెట్రోల్ ధర నియంత్రణ ప్రకటించాయి. ఆ దేశాలు నిర్ణయించిన పరిమిత ధరలోపు సముద్రం మీదుగా సరఫరా చేసే గానీ రష్యా నుంచి కొనుగోలు చేస్తామని తెలిపాయి. ఈ ఒప్పందంలో భాగమైన దేశాలకు చమురు ఎగమతి చేయబోమని రష్యా తేల్చి చెప్పింది. చూడబోతే రష్యా వైఖరి కారణంగా ప్రపంచదేశాలు మునుముందు తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటాయనే అనుమానం కలుగుతోంది.