Pakistan: వరదలు అల్లా ఆశీర్వాదం..నీటితో బకెట్లను నింపండి.. పాక్ రక్షణ మంత్రి ప్రజలకు ఉచిత సలహా

పాకిస్తాన్‌లో వరదలు భారీ విధ్వంసం సృష్టించాయి. ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఇంతలో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ వరద అల్లాహ్ ఇచ్చిన బహుమతి.. ఆశీర్వాదం అని వివాదాస్పద ప్రకటన చేశారు. ప్రజలు ఈ నీటిని తమ ఇళ్లలో నిల్వ చేసుకోవాలని సూచించారు. ఈ ప్రకటనపై ప్రతిపక్షాలు, ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లక్షలాది మంది ప్రజలు వరదల వల్ల ప్రభావితమయ్యారు. మరోవైపు వరద బాధితులకు అంతర్జాతీయ సహాయం కూడా అందుతోంది.

Pakistan: వరదలు అల్లా ఆశీర్వాదం..నీటితో బకెట్లను నింపండి.. పాక్ రక్షణ మంత్రి ప్రజలకు ఉచిత సలహా
Pakistan Floods

Updated on: Sep 02, 2025 | 5:48 PM

పాకిస్తాన్‌లో వరదలు సాధారణ జీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. వందలాది గ్రామాలు మునిగిపోయాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. ఇంతలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద ప్రకటన చేశారు. ఈ వరద అల్లాహ్ ఇచ్చిన బహుమతి అని అన్నారు. ఆయన పాకిస్తానీయులమైన మనపై తన దయ చూపించాడు. మన ప్రజలను రక్షించడానికి ఆయన ఈ నీటిని మనకు ఇచ్చాడు. ప్రజలు ఈ నీటిని తమ ఇళ్లలో బకెట్లు, టబ్‌లలో సురక్షితంగా నిల్వ చేసుకోవాలని చెప్పాడు.

సహాయం కోసం వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపే బదులు, పౌరులు వరద నీటిని టబ్‌లు, బకెట్లలో నిల్వ చేసుకోవాలని ఆయన అన్నారు. ఇది అల్లాహ్ ఇచ్చిన దీవెన అని చెబుతూ.. ప్రజలు సహనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఖవాజా ఆసిఫ్ చేసిన ఈ ప్రకటన పాకిస్తాన్‌లో రాజకీయ వివాదాన్ని సృష్టించింది. ప్రతిపక్ష పార్టీలు దీనిని అసంబద్ధం, అసభ్యకరమైన వ్యాఖ్యలుగా అభివర్ణించాయి

వరదల వల్ల ప్రాణనష్టం, జనజీవనంపై ప్రభావం:

పాకిస్తాన్‌లోని అనేక ప్రావిన్సులలో నిరంతర భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతున్నాయి. వందలాది గ్రామాలు మునిగిపోయాయి. లక్షలాది మంది ప్రజలు సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందవలసి వచ్చింది. వ్యవసాయానికి భారీ నష్టం వాటిల్లింది. పశువులు కొట్టుకుపోయాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. విపత్తు నిర్వహణ సంస్థలు నిరంతరం సహాయ సామగ్రిని సరఫరా చేస్తున్నాయి.

ప్రతిపక్షాల దాడి, ప్రజల ఆగ్రహం

ఖవాజా ఆసిఫ్ ప్రకటనపై ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని, బాధలను పెంచే ప్రకటనలు చేయకూడదని వారు అంటున్నారు. అనేక సామాజిక సంస్థలు ,సాధారణ పౌరులు కూడా సోషల్ మీడియాలో మంత్రి వ్యాఖ్యలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను అర్థం చేసుకోవడానికి బదులుగా ఉచిత సలహాలు ఇస్తూ.. ఉపదేశిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయ సహాయం

పాక్ లో వరద బాధితులకు సహాయం చేయడానికి ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. వరద ప్రభావిత ప్రాంతాలకు సహాయం చేయడానికి సహాయ సామగ్రిని పంపడం ప్రారంభించాయి. అనేక దేశాలు పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయం, మందులను అందిస్తామని హామీ ఇచ్చాయి. అయితే మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం, పరిపాలనా బలహీనత కారణంగా.. వరద బాధితులకు సహాయం సరిగ్గా చేరడం లేదని తెలుస్తోంది.

మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు

పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు వర్షాలు, వరదలు ఆ దేశ పరిస్థితిని మరింత దిగజార్చాయి. వరద పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది. ప్రభుత్వం ప్రజల బాధలను పట్టించుకోకుండా చూస్తోందని.. ఇటువంటి ప్రకటనలు దాని వైఫల్యాన్ని దాచడానికి చేసే ప్రయత్నం మాత్రమే అంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వరద బాధిత ప్రజలు ఇప్పుడు ప్రభుత్వ పనితీరును నేరుగా ప్రశ్నించడం ప్రారంభించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..