
Egypt Train Accident: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. గిజా ప్రావిన్స్‌లో ఆదివారం రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కనీసం నలుగురు మృతి చెందగా, సుమారు 120 మంది ప్రయాణికులు గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాత్రం ఇప్పటివరకు 64 మంది గాయపడినట్లు అధికారికంగా ప్రకటించింది. మృతుల వివరాలపై వెంటనే ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
కైరో నగర శివార్లలోని అల్-అయ్యత్ (Al-Ayyat) జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఈజిప్టు అధికారుల సమాచారం ప్రకారం.. గిజా నుంచి ఫయ్యూమ్‌కు వెళ్తున్న ఓ ప్యాసింజర్ రైలు, కైరో-అస్వాన్ మార్గంలో ప్రయాణిస్తున్న మరో రైలును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో రైలు పట్టాలు తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. దెబ్బతిన్న రైలు బోగీల శిథిలాలను తొలగించేందుకు భారీ క్రేన్లను రంగంలోకి దించారు. రైల్వే ట్రాక్‌లపై అడ్డుగా ఉన్న శిథిలాలను తొలగించి, రైళ్ల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, క్షతగాత్రులకు వైద్య చికిత్స అందించడంపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. రైలు సర్వీసులు పూర్తిస్థాయిలో ఎప్పటికి పునరుద్ధరిస్తారనే విషయంపై స్పష్టత రాలేదు.
అల్-అయ్యత్ జిల్లాలో గతంలోనూ రైలు ప్రమాదం జరిగింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇదే ప్రాంతంలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఆ ఘటనలో రైలు డ్రైవర్‌తో పాటు ఆయన సహాయకుడు గాయపడ్డారు. తాజాగా జరిగిన ప్రమాదంలో మాత్రం ప్రయాణికులతో వెళ్తున్న రెండు రైళ్లు ఢీకొనడంతో ప్రాణనష్టం సంభవించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది. ముఖ్యంగా మృతుల సంఖ్య, గాయపడిన వారి తుది సంఖ్యపై ఈజిప్టు అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.