వారం పది రోజు వ్యవధిలోనే మరో ఘోర ప్రమాదం. ఒకరిద్దరు కాదు 11మంది మృత్యువాత పడ్డారు. గమ్య స్థానాలకు చేరాల్సిన వాళ్లు కాస్తా .మృత్యు ఒడికి చేరారు. ఆదివారం కైరోకు ఉత్తరాన జరిగిన రైలు ప్రమాదం జరిగిందని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది
ఉత్తర ఆఫ్రికాలోని ఈజిప్ట్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు చనిపోయారు. ఈజిప్ట్‌లోని స్వాల్ యూబియా ప్రాంతంలో ఓ ప్యాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పింది. అంతే రైలులో ప్రయాణిస్తున్న వారిలో 11 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో 100మందిపైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 60 అంబులెన్సుల్లో స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కూడా మరికొందరి పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు.
ప్రమాదానికి గురైన రైలు ఈజిప్టు రాజధాని కెయిరో నుంచి నైలు డెల్టా నగరానికి బయల్దేరింది. ఈక్రమంలో స్వాల్ యూబియా ప్రాంతానికి చేరుకుంటుండగా వరుసగా నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. చాలా మంది ప్రయాణికులు బోగీల్లో చిక్కుకున్నట్లు అధికారులు వివరించారు. సహాయక చర్యలను చేపట్టి బోగీల్లో చిక్కుకున్న వాళ్లను బయటకు తీశారు. అయితే ఈ ప్రమాదం జరగటానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అధ్యక్షుడు అబ్దేల్-ఫట్టా అల్-సిసి ఆదివారం మిలిటరీ ఇంజనీరింగ్ అథారిటీని విచారించి, తాజా సంఘటనపై దర్యాప్తు జరిపాలని ఆదేశించారు.
సరిగ్గా వారం రోజుల క్రితం ఈజిప్ట్‌లోని మిన్యా ఆల్‌క్వామా ప్రాంతంలో రైలు పట్టాలు తప్పిన ఒక టన్నెల్‌ని ఢీకొంది. ఆ ప్రమాదంలో 20మంది చనిపోగా, 199 మంది గాయపడ్డారు.
Read Also… అసోం మాజీ ముఖ్యమంత్రి భూమిధర్బర్మన్ కన్నుమూత.. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి