ఎబోలా మహమ్మారి విలయం.. 5 వేలు దాటిన మరణాలు.. 10 వేల మందికి పైగా వైరస్‌ వ్యాప్తి!

ఆఫ్రికా దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. ఇప్పటివరకు ఈ వైరస్‌ బారినపడి 5,026 మంది ప్రాణాలు కోల్పోగా.. 10,351 కేసులు నమోదయ్యాయి. మరణాల రేటు దాదాపు 50 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. బుండిబుగ్యో వైరస్‌ వ్యాప్తి, వ్యాక్సిన్‌ లేకపోవడం, మరోవైపు సాయుధ ఘర్షణల కారణంగా ఎబోలాను కట్టడి చేయడం అధికారులకు సవాలుగా మారింది..

ఎబోలా మహమ్మారి విలయం.. 5 వేలు దాటిన మరణాలు.. 10 వేల మందికి పైగా వైరస్‌ వ్యాప్తి!
Ebola Outbreak In Congo

Updated on: Nov 01, 2026 | 8:59 AM

కాంగో, నవంబర్‌ 1: ఆఫ్రికా దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా మహమ్మారి తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకూ వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండటంతో మరణాల సంఖ్య 5 వేలు దాటింది. ఇప్పటివరకు 10 వేల మందికి పైగా ఈ వైరస్‌ బారినపడినట్లు ప్రభుత్వ తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ పరిస్థితి ఆరోగ్య నిపుణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌ను కట్టడి చేయడంలో అధికారులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 10,351 ఎబోలా కేసులు నమోదయ్యాయి. వీరిలో 5,026 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే మరణాల రేటు దాదాపు 50 శాతంగా ఉంది. ఇప్పటివరకు 2,788 మంది వ్యాధి నుంచి కోలుకున్నట్లు సమాచారం.

బుండిబుగ్యో (Bundibugyo) వైరస్‌ కారణంగా ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. మే నెల మధ్యలో ఎబోలా వ్యాప్తిని అధికారికంగా ప్రకటించారు. అయితే అనూహ్యంగా వైరస్‌ విజృంభించడంతో అధికారులు దాన్ని నియంత్రించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2014 నుంచి 2016 మధ్య పశ్చిమ ఆఫ్రికాలో రెండేళ్లపాటు కొనసాగిన ఎబోలా మహమ్మారి సుమారు 11 వేల మందిని బలిగొంది. ఆ తర్వాత అత్యధిక మరణాలకు కారణమైన రెండో అతిపెద్ద ఎబోలా వ్యాప్తిగా ప్రస్తుత పరిస్థితి నిలిచింది. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రోగ్రామ్ ఏరియా మేనేజర్ డాక్టర్ పాట్రిక్ ఓటిమ్ మాట్లాడుతూ.. ఈ మరణాలు కేవలం గణాంకాలు మాత్రమే కాదని, ఎన్నో కుటుంబాలు, సమాజాలు తీవ్రంగా నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఖ్య వ్యాధి తీవ్రతను తెలియజేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం బుండిబుగ్యో వైరస్‌కు నిర్దిష్టమైన వ్యాక్సిన్‌ లేదా చికిత్స అందుబాటులో లేదు. దీంతో వైద్య సిబ్బంది రోగుల్లో కనిపించే లక్షణాల ఆధారంగా చికిత్స అందిస్తున్నారు.

మే నెల నుంచి ఇప్పటివరకు కాంగోలోని 26 ప్రావిన్సుల్లో ఎనిమిది ప్రావిన్సులకు ఎబోలా వ్యాపించింది. మొత్తం 178 ఆరోగ్య మండలాల్లో 67 ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. వీటిలో 50 ప్రాంతాల్లో ఇప్పటికీ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశ తూర్పు ప్రాంతాల్లోని ఇటూరి, నార్త్‌ కివు ప్రావిన్సుల్లో వైరస్‌ ప్రభావం అధికంగా ఉంది. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి 9,782 కేసులు, 4,792 మరణాలు నమోదయ్యాయి. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు బాధితులతో సంబంధం ఉన్నవారిని గుర్తించడం (కాంటాక్ట్‌ ట్రేసింగ్‌), అనుమానితులకు పరీక్షలు నిర్వహించడం అత్యంత కీలకం. అయితే ఈ రెండు చర్యలను సమర్థంగా అమలు చేయడంలో ఆరోగ్య అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫ్రికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 80 శాతం, ఇప్పటికే ఆరోగ్య అధికారులు పర్యవేక్షిస్తున్న బాధితుల కాంటాక్ట్‌ జాబితాకు వెలుపల ఉన్నవారిలో కనిపిస్తున్నాయి. మరోవైపు నమోదైన మరణాల్లో దాదాపు మూడో వంతు మంది ఆసుపత్రులు లేదా చికిత్స కేంద్రాలకు చేరకముందే ప్రాణాలు కోల్పోతున్నట్లు WHO అధికారి పాట్రిక్ ఓటిమ్ తెలిపారు. దీంతో వారికి ఎబోలా పరీక్షలు నిర్వహించే అవకాశం కూడా లేకుండా పోతోందని వివరించారు.

ఇవి కూడా చదవండి

కాంగో తూర్పు ప్రాంతాల్లో ఇప్పటికే కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ఎబోలా కట్టడి చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది. ప్రభుత్వ బలగాలకు, పలు సాయుధ గ్రూపులకు మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. వీటిలో రువాండా మద్దతు ఉన్న ఎం23 తిరుగుబాటు గ్రూపు కూడా ఉంది. అదేవిధంగా ఉగాండా సరిహద్దు ప్రాంతాల్లో అలైడ్‌ డెమొక్రటిక్‌ ఫోర్సెస్‌ (ADF) అనే ఇస్లామిక్‌ తిరుగుబాటు సంస్థ దాడులకు పాల్పడుతోంది. ఈ భద్రతాపరమైన సమస్యల కారణంగా వైద్య సిబ్బంది ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారింది. అనుమానితులను గుర్తించడం, పరీక్షలు నిర్వహించడం, బాధితులకు సకాలంలో చికిత్స అందించడం వంటి చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఒకవైపు ఎబోలా వైరస్‌ వ్యాప్తి.. మరోవైపు సాయుధ ఘర్షణలు.. వెరసి కాంగోలో పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us