అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ట్విటర్ శాశ్వతంగా ‘తలుపులు’ మూసేసింది. తమ వేదికలోకి ఆయనను అడుగుపెట్టనివ్వబోమని, అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసినా ఇదే పరిస్థితి ఉంటుందని ట్విటర్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగాల్ తెలిపారు. తమ విధానాల ప్రకారం ఈవేదికపై నుంచి మిమ్మల్ని తొలగించినప్పుడు, మీరు కామెంటేటర్ అయినా, సీఎఫ్ఓ అయినా, ప్రస్తుత మాజీ అధ్యక్షుడైనా సరే..ఇదే సూత్రం వర్తిస్తుంది ఆయన చెప్పారు. జనవరి 6 న వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ వద్ద తన మద్దతుదారుల చేత ట్రంప్ పెద్ద ఎత్తున అల్లర్లను, ఘర్షణలను ప్రేరేపించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ట్విటర్ సహా ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా సాధనాలు కూడా ఆయనను బ్యాన్ చేశాయి. హింసను, అల్లర్లను రెచ్ఛగొట్టనివారికి మాత్రమే తమ పాలసీలు అనుకూలంగా ఉంటాయని నెడ్ సెగాల్ స్పష్టం చేశారు.
ఇలా వయొలెన్స్ ను సృష్టించేవారిని మళ్ళీ అడుగుపెట్టనిచ్ఛే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. తను అధ్యక్షునిగా ఉండగా ట్రంప్… ట్విటర్ ను సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకున్నారు. తన ఎన్నికల ప్రచారానికి, తన ప్రత్యర్థులను దుయ్యబట్టడానికి దీనిపైనే ఆధార పడుతూ వచ్చారు. ట్విటర్ లో ఆయన అకౌంట్ క్లోజయ్యే నాటికి ఆయనకు 80 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.